ఎల్ నినో ఎఫెక్ట్.. తాగు, సాగునీటికి తీవ్ర కొరత!
Publish Date:May 9, 2026
Advertisement
ఎల్‌నినో ప్రభావం ఇండయాపై తీవ్రంగా ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను దెబ్బతీసే ఎల్ నినో ఈ సారి ఇండియాపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఇన్ కాయిస్) పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న అసాధారణ మార్పుల వల్ల కారణంగా ఏర్పడే ఎల్ నినో ప్రభావం ఇండియాపై వచ్చే ఏడాది జనవరి వరకూ ఉంటుందని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలోని తూర్పు, మధ్య ప్రాంత ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయనీ, దీనివల్ల దేశంలో వర్షపాతం గణనీయంగా తగ్గి.. కరువు పరిస్థితులు ఏర్పడే ముప్పు ఉందని తెలిపింది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందనీ, అందువల్ల సాగునీటి కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ అంచనాలను రూపొందించడానికి అత్యంత అధునాతనమైన బేయేసియన్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్ (బీసీఎన్ఎన్) అనే డీప్ లెర్నింగ్ మోడల్‌ను ఉపయోగించారు. ఈ టెక్నాలజీ సహాయంతో వాతావరణంలో వచ్చే మార్పులను దాదాపు రెండేళ్ల ముందే పసిగట్టవచ్చు. ఈ మోడల్ విశ్లేషణ ప్రకారం.. రాబోయే రెండున్నరేళ్ల పాటు ఎల్‌నినో ప్రభావం కొనసాగుతుంది. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణ పరిస్థితులను అస్తవ్యస్తం చేసే ప్రమాదం ఉంది. సముద్ర మట్టంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కేవలం భూమిపైనే కాకుండా, సముద్ర గర్భంలోనూ పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ఉత్తర హిందూ మహాసముద్రంలో సుదీర్ఘమైన మెరైన్ హీట్ వేవ్స్ వస్తాయి. దీనివల్ల సముద్ర పర్యావరణ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా, చేపల వేటపై ఆధారపడే మత్స్యకారుల జీవనోపాధికి కూడా గండి పడుతుంది. గతంలో ఎల్‌నినో ప్రభావం వల్ల దేశంలో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి. 2023లో కూడా వర్షపాతం తగ్గడం వల్ల వరి, పప్పుధాన్యాల సాగుపై ప్రభావం పడింది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు ఆశాజనకంగా లేకపోవడంతో ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. 2027 వరకు ఇదే పరిస్థితి కొనసాగితే సాగునీటితో పాటు తాగునీటి ఎద్దడి కూడా ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించడం, నీటి పొదుపు చర్యలు చేపట్టడం వంటి ముందస్తు జాగ్రత్తలు అవసరమని పేర్కొంటున్నారు.
http://www.teluguone.com/news/content/severe-shortage-of-drinking-and-irrigation-water-36-219310.html





