ఉప్పొంగిన పండమేరు.. నీటమునిగిన కాలనీలు
Publish Date:Oct 22, 2024
Advertisement
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అనంతపురం నగర శివారు కాలనీలో పూర్తిగా నీట మునిగాయి. శ్రీ సత్య సాయి జిల్లాలో చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రెండున్నర దశాబ్దాల కాలంలో ఎప్పుడూ లేనివిధంగా చిత్రావతికి వరద పోటెత్తింది. అదే జిల్లాలోని కనగానపల్లి చెరువు తెగిపోవడంతో అనంతపురం నగరం సమీప కాలనీలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మూడు దశాబ్దాలుగా ఎన్నడూ ఇంత స్థాయిలో వరద పోటెత్తలేదని స్థానికులు చెబుతున్నారు. వరద ముందు కారణంగా భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ప్రధానంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అక్కడికి సమీపంలో ఉన్న కాలనీవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. ఇలా ఉండగా.. అనంతపురం శివారులో పండమేరు వాగు ఉధృతంగా ప్రవహించి పోటెత్తడతో వాగుకు ఆనుకుని ఉన్న పలు కాలనీలోకి వరద నీరు ప్రవహించింది. వరద నీటిలో ఇళ్ళు మునగగా.. ఆటోలు, బైకులు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. కనగానపల్లి చెరువు కట్ట తెగడంతో పండమేరు వాగుకు వరద ఉధృతి వచ్చింది. అటు పెనుకొండలో రాత్రి కురిసిన భారీ వర్షానికి గుట్టూరు, వెంకటగిరి పాలెం చెరువులు పొంగి, పొర్లుతున్నాయి. భారీ వర్షంతో ఒక్కసారిగా హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వరద నీరు రావడంతో.. వరద నీటిలోనే బస్సులు, లారీలు, కార్లు నిలిచిపోయాయి. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వరద నీటిలో చిక్కుకున్న బస్సులను పోలీసులు జేసీబీల సాయంతో బయటకు తీసి.. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
http://www.teluguone.com/news/content/several-colonies-waterlogged-25-187200.html





