వైసీపీ అసంతృప్త నేతల రహస్య సమావేశం.. జగన్ పై తిరుగుబాటు?
Publish Date:Dec 16, 2023
Advertisement
ఎన్నికలకు సిద్ధం కావాలంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు అధికార పార్టీలో అలజడి రేపుతోంది. ఒకవైపు ఎన్నికలకు సిద్ధం కావాలని చెబుతూనే ఇష్టారీతిగా అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు చేపట్టడాన్ని వైసీపీలో అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. సిట్టింగులు అసంతృప్తితో, ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పనితీరు సరిగా లేదని, ప్రజలలో అసంతృప్తి ఉందని మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు సహా భారీ ఎత్తున అభ్యర్థులను మార్చేయాలన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం కాదు, ధిక్కరించడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే 11 మందిని మార్చేసిన జగన్ 45 మందితో ఇలా మార్చేయనున్న వారి రెండో జాబితాను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అంతే కాకుండా మూడో జాబితా కూడా ఉంటుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మొత్తం 90 మంది వరకూ అభ్యర్థుల మార్పు ఉంటుందని పార్టీ అగ్రనాయకత్వం చెబుతోంది. దీంతో ఎక్కడికక్కడ అభ్యర్థులలో అసంతృప్తి రగిలిపోతోంది. కనీసం సీనియర్లు, మంత్రులు అని కూడా చూడకుండా పక్కన పెట్టేయడం, పక్కకునెట్టేయడం, కొందరికైతే అసలు పార్టీ టికెట్లే ఉండవన్న వార్తల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్లు రహస్యంగా సమావేశమై జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని, తీరు మార్చుకోకుంటే పార్టీ వీడడానికైనా వెనుకాడరాదనీ తీర్మానించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు ఇలా ఇష్టారీతిన నియోజకవర్గాలను మార్చేయడంపై అధిష్టానాన్ని నిలదీస్తున్నారని అంటున్నారు. సాక్షాత్తు జగన్ తీసుకున్న నిర్ణయమని అధిష్టానం పెద్దలు చెబుతున్నా అయితే ఏంటీ వీ డోంట్‌కేర్ అంటున్నారని పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా సీఎం నిర్ణయం తీసుకుంటే తాము అంగీకరించేది లేదని ఇప్పటికే కొందరు నేతలు తేల్చి చెప్పేసినట్లు తెలుస్తున్నది. కాగా ఇప్పుడు ఏకంగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కటై తిరుగుబాటు జెండా ఎగరేసేందుకు సిద్దమైనట్లు రాజకీయ వర్గాలలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఓ వైసీపీ ఎంపీ బెంగళూరు గెస్ట్ హౌస్ ఈ అసంతృప్త నేతలకు శిబిరంగా మారినట్లు తెలుస్తున్నది. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆ ఎంపీ బెంగళూరు గెస్ట్ హౌస్ లో సమావేశమైన వైసీపీ అసంతృప్త మంత్రులు, ఎమ్మెల్యేలు అధిష్టానంపై తిరుగుబావుటా ఎగరేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. జగన్ తన ఇష్టానుసారం సీట్ల మార్పిడి చేస్తా అంటే కుదరదని మంత్రులు, ఎమ్మెల్యేలు ఖరాఖండిగా నిర్ణయించుకున్నట్లు సన్నిహితుల నుండి సమాచారం బయటకి పొక్కింది. బెంగళూరులో జరిగిన ఈ సమావేశానికి 75 నుండి 80 మంది వైసీపీ ఎమ్మెల్యేలు హాజరైనట్లు తెలుస్తుండగా.. అందరూ ఏకతాటిపై నిలబడి అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి నిధులు రాకపోయినా తాము సొంత ఖర్చులతో నియోజకవర్గాన్ని, కార్యకర్తలను జారిపోకుండా చూసుకున్నామని, ఇప్పుడు హఠాత్తుగా నియోజకవర్గ మార్పిడి చేస్తే తమ పరిస్థితి ఏంటని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సమావేంలో ఆవేదన వ్యక్తం చేశారంటున్నారు. ఒకవేళ తమకు స్థానచలనం తప్పదు అంటే పార్టీని వదలక తప్పదని మరికొందరు ఎమ్మెల్యేలు కరాకండీగా చెప్పేసినట్లు తెలుస్తున్నది. కాగా, ఈ సమావేశంలో మంత్రుల వ్యాఖ్యలు, పరిస్థితి చూసిన కొందరు ఎమ్మెల్యేలు అప్పుడే పక్కచూపులు చూడటం మొదలెట్టేశారనీ, తెలుగుదేశంతో టచ్ లోకి వచ్చేశారనీ అంటున్నారు. సీటు విషయంలో పట్టుబట్టబోమనీ, తెలుగుదేశంలో చేర్చుకుంటే చాలనీ కూడా వారు అంటున్నారని చెబుతున్నారు. సంక్రాంతి అనంతరం ఈ నేతల చేరికలు ఉండనున్నట్లు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది బెంగళూరులో సమావేశం, పార్టీపై తిరుగుబాటుకు సంకేతంగా చెబుతున్నారు. ఇప్పటికే 11 మంది అభ్యర్థులను మార్చేసిన జగన్.. ఇప్పుడు మరో 45 మందితో రెండో జాబితా సిద్ధం చేసినట్లు చెప్తున్నారు. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి తొలి వారంలో ఈ రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ జాబితావిడుదల తరువాత ఏపీ రాజకీయాలలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఇంకా చెప్పాలంటే జనవరి తర్వాత ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాక్షాత్తు మంత్రులే వైసీపీని వీడే అవకాశం మెండుగా ఉన్నాయనీ, అలాగే మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే వైసీపీపై తిరుగుబాటు ప్రకటించి బహిరంగ విమర్శలకు దిగనున్నారని అంటున్నారు. ఇదే క్రమంలో అసంతృప్త ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇంకెన్ని రహస్య సమావేశాలు నిర్వహించనున్నారన్నదానిపై కూడా రాజకీయవర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/secret-meeting-of-dissident-leaders-in-ycp-25-167176.html





