అగ్నిప్రమాద బాధితులకు తక్షణ సాయం అందించండి : సీఎం చంద్రబాబు
Publish Date:Jan 13, 2026
Advertisement
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని సార్లంకపల్లె గ్రామంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 26 గిరిజన గుడిసెలు పూర్తిగా కాలి బూడిద కాగా, 33 కుటుంబాలు నిలువ నీడ కోల్పోయి నిరాశ్రయులయ్యాయి. అటవీ ఉత్పత్తులను ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న ఈ కుటుంబాలు ఒక్కసారిగా సర్వం కోల్పోయి తీవ్ర ఆందోళనలో మిగిలిపోయాయి. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అధికారులతో మాట్లాడి బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ప్రతి బాధిత కుటుంబానికి రూ.25,000 చొప్పున నగదు అందించడంతో పాటు ఇల్లు కోల్పోయిన వారికి పక్కా గృహాలు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. బాధితులకు తాత్కాలిక వసతి, ఆహారం, అవసరమైన సాయాన్ని కల్పించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జి రెడ్డి గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి, ప్రభుత్వపు పూర్తి సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. తహసీల్దార్ ఎస్.వి. నరేశ్ మాట్లాడుతూ, 33 కుటుంబాలకు రూ.25 వేల చొప్పున నగదు సహాయం పంపిణీ చేసినట్టు తెలిపారు. బాధితులందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ప్రస్తుతం వారికి ఆహారం, నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
http://www.teluguone.com/news/content/sarlankapalle-fire-accident-36-212481.html





