రాజయ్య కోడలు చనిపోయి సాధించిందా?
Publish Date:Nov 4, 2015
Advertisement
కాంగ్రెస్ మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక ఆమె ముగ్గురు కుమారులు బుధవారం ఉదయం అగ్ని కీలలకు ఆహుతి అయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజయ్య మీద, ఆయన కుమారుడి మీద సారిక చాలా సంవత్సరాలుగా చేస్తు్న్న న్యాయపోరాటం అర్ధంతరంగా ముగిసిపోయింది. కొంతమంది ఈ ఘటనను ఆత్మహత్యగా భావిస్తున్నారు. సారిక తరఫు బంధువులు మాత్రం ఇది ముమ్మాటికీ హత్యేనని అంటున్నారు. ఈ మేరకు రాజయ్య మీద అతని భార్య, కుమారుడి మీద కేసు నమోదైంది. పోలీసులు వారిని అరెస్టు కూడా చేశారు. అయితే సారిక మరణం తర్వాత బయటి ప్రపంచానికి వెల్లడి అవుతున్న విషయాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. రాజయ్య కుమారుడిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి సారిక రాజయ్య కుటుంబం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికులు మీడియాకు వివరిస్తున్నారు. అయితే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వం వున్న సారిక ఇలా పిరికిదానిలా ఆత్మహత్య చేసుకుంటుందని తాము ఎంతమాత్రం ఊహించలేదని అంటున్నారు. అయితే సమస్యల ఒత్తిడిని తట్టుకోలేక, తన మామ రాజయ్యను రోడ్డుకు ఈడ్చడానికే సారిక ఇలాంటి పనికి ఒడిగట్టిందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.
ఎంపీ హోదాలో ఉన్న సమయంలో రాజయ్య తన కోడలిని అనేక రకాలుగా వేధించినట్టు సమాచారం. ఆ వేధింపులు తట్టుకోలేక సారిక రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసిందట. రాజయ్య కుటుంబ సభ్యుల మీద గృహహింస చట్ట ప్రకారం కేసు కూడా పెట్టింది. రాజయ్యను బజారుకు ఈడ్చడానికి ఆమె అవిశ్రాంత యోధురాలిలా ప్రయత్నించేది. వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక సందర్భంగా ఆ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజయ్య టిక్‌ట్ ఆశిస్తున్న విషయం తెలుసుకుని సారిక కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి లేఖ రాసినట్టు సమాచారం. రాజయ్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్ ఇవ్వరాదని ఆమె ఆ లేఖలో కోరిందట. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాజయ్యకే టిక్కెట్ ఇచ్చింది. బుధవారం నాడు ఆయన నామినేషన్ దాఖలు చేయడానికి సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాను చనిపోయి అయినా రాజయ్యను సాధించాలన్న ఉద్దేశంతోనే సారిక ఆత్మహత్య చేసుకుని వుండవచ్చని కొంతమంది అనుమానిస్తున్నారు. సారిక ఆ ఉద్దేశంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టయితే, ఆమె కోరుకున్నదే జరిగింది. రాజయ్య పోటీ నుంచి తప్పుకోక తప్పలేదు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. రాజయ్య ప్రతిష్ఠ పూర్తిగా దిగజారిపోయింది. అయితే దీన్ని సాధించడం కోసం తన ప్రాణాన్ని, ముగ్గురు చిన్నారుల ప్రాణాన్ని బలిచేయడం సారికకు తగదని పలువురు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/sarika-suicide-45-52005.html





