మంత్రుల బస్సు యాత్ర తుస్సు.. జనం లేక మంత్రుల ఉసూరు!
Publish Date:May 29, 2022
Advertisement
సాజాజిక న్యాయ భేరి అంటూ వెనుకబడిన తరగతులకు చెందిన 17 మంది మంత్రులతో చేపట్టిన బస్సు యాత్ర ప్రభుత్వానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. జనంలో జగన్ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను తేటతెల్లం చేసింది. బలవంతంగా బస్సుల్లో తీసుకువచ్చినా జనం సభలో కూర్చోడానికి ఇష్టపడలేదు. పోలీసులు బలప్రయోగం చేసి వెళ్లిపోయేవాళ్లను ఆపుదామన్నా వారు ఆగలేదు. సభా ప్రాంగణం గేట్లు మూసేసినా తోసుకుని మరీ వెళ్లిపోయారు. గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమం ఘోరంగా విఫలం కావడంతో జగన్ సర్కార్ సామాజిక న్యాయ భేరి పేరిట బస్సు యాత్ర చేపట్టింది. ఈ యాత్ర కూడా తుస్సు మంది. మంత్రుల బస్సుయాత్ర సభలకు జనం కరవయ్యారు. స్థానిక నాయకులకు, వలంటీర్లకు టార్గెట్లు పెట్టి మరీ బస్సుల్లో జనాన్ని తరలించినా, వారు సభా స్థలికి చేరగానే వెనక్కు మళ్లిపోవడం కనిపించింది. తీరా మంత్రుల బస్సు చేరుకునే సరికి సభా ప్రాంగణం అంతా ఖాళీ అయిపోతున్న పరిస్థితి. విజయ నగరంలో అయితే జనం లేక ఏకంగా సభనే రద్దు చేశారు. ఇక మిగిలిన చోట్ల కూడా జనం లేకపోవడంతో మంత్రులు కుప్తంగా ప్రభుత్వ పథకాలను, అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని చెప్పి సభను ముగించి మళ్లీ బస్సు ఎక్కేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కావడంతో వైసీపీలో గుబులు పెరిగిపోతున్నది. ప్రజలలో జగన్ ప్రభుత్వంపై ప్రస్ఫుటంగా ప్రజా వ్యతిరేకత కనిపిస్తుండటంతో బస్సుయాత్రలో పాల్గొన్న మంత్రులకే కాకుండా మొత్తం వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలలోనే తమ రాజకీయ భవిష్యత్ పై బెంగ మొదలైందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. బలవంతంగా జనాలను సభలకు బస్సుల్లో తరలించినా వారు ఆగకుండా వెళ్లిపోతుంటే.. మైకుల్లోనే వారికి కూర్చో మంటూ నేతలు బతిమాలడం వినిపించింది. కాగా ఎంత సేపూ అమ్మ ఒడి, పింఛన్లు, రైతు భరోసా అంటూ అరకొరగా అమలు చేసిన పథకాల గురించే గొప్పగా చెప్పుకుంటుంటే జనం విసుగెత్తిపోతున్నారని పార్టీ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలో భాగంగా నాల్గవ రోజు ఆదివారం నంద్యాలలో మంత్రుల సభ వెలవెలబోయింది. నంద్యాల శ్రీనివాస్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభకు జనం కరువయ్యారు. సభలో కనీసం రెండు వరుసల కుర్చీలు కూడా నిండలేదు. ఆ రెండు వరుసలలో కూడా వైసీపీ కార్యకర్తలే కూర్చున్న పరిస్థితి. ల సభ అట్టర్ ప్లాప్ కావడంతో మంత్రులు మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. ఈ సభకు వైసీపీ నేతలు కష్టపడి జనాలను తరలించినా వారు మంత్రులు మాట్లాడే సమయానికి వెనుదిరిగారు. సభను రద్దు చేసుకుని వెళిపోతే జనంలో ఇంకా పలుచన అవుతామని భావించి ఏదో జరిగిందన్నట్లు మమ అనిపించేశారు. కేవలం ఇద్దరు మంత్రులు మాత్రమే మాట్లాడారు. కర్నూలులోనూ ఇదే పరిస్థితి. మంత్రులు ఖాళీ కుర్చీలను ఉద్దేశించి ఉపన్యాసాలు చేయాల్సిన పరిస్థితి. క్లుప్తంగా ఏదో ప్రసంగించామన్నట్లు చేసి మంత్రులు బస్సెక్కి వెళ్లిపోయారు.
http://www.teluguone.com/news/content/sanajika-nyaya-bheri-bus-yatra-a-big-faikure-25-136640.html





