తాడేపల్లి ప్యాలెస్‌లో సజ్జల మరో విజయసాయేనా?
Publish Date:Jun 5, 2023
Advertisement
సజ్జల రామకృష్ణా రెడ్డి స్వతాహాగా రాజకీయ నాయకుడు కాదు.ఆయన ఒక జర్నలిస్ట్. జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించిన ఆయన వ్యాపార వేత్తగా ఎదిగారు.ఆ పైన వ్యాపార భాగస్వామ్యాన్ని, రాజకీయాలతో ముడివేసి రాజకీయ నాయకుడయ్యారు.అయితే, సజ్జల జర్నలిస్ట్ జీవితాన్ని పక్కన పెడితే, వ్యాపార, రాజకీయ ప్రయాణంలో ఆయన చాలా వరకు వైఎస్ కుటుంబంతో కలిసే ప్రయాణం చేశారు. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి తోనే ఆయన రాజకీయ ప్రయాణం సాగింది. జగన్ తో ఆయన రాజకీయ సంబంధాలు, మధ్య మధ్యన కొంత ఒడి దుడుకులు, ఎత్తు పల్లాలు ఎదుర్కున్నా, ఎదురైన అవరోధాలను అధిగమించిన ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారు స్థాయికి చేరుకున్నారు. అంతవరకు అన్ని వ్యవహరాలలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిని పక్కకు నెట్టి ఆ స్థానాన్ని సజ్జల సొంత చేసుకున్నారు. ఆ విధంగా ఆయన రాజకీయాల్లో మొదటి గమ్యాన్నిచేరుకున్నారు. నిజానికి ఆయన పేరుకు ముఖ్యమంత్రి సలహాదారే కానీ, వాస్తవంలో ఆయన ఇంటర్నల్ స్టేటస్ ఇంకా చాలా చాలా ఎక్కువని వైసీపీ శ్రేణులే చెబుతుంటాయి. అలాగే సర్వ శాఖల మంత్రిగా ప్రసిద్ది చెందిన సజ్జల పార్టీ, ప్రభుత్వ రాజకీయాలపైనే కాకుండా ప్యాలెస్ రాజకీయాలపై కూడా పట్టు సాధించారని, అందుకే ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత ముఖ్య నేతగా చక్రం తిప్పుతున్నారని, ఇంకా స్పష్టంగా చెప్పలంటే డిఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని పార్టీ నాయకులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఆ కారణంగానే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, పార్టీ కీలక నేతలతో సహా చాలా మంది నాయకులు ఆయన పట్ల చాలా గుర్రుగా ఉన్నారని అంటారు. అదలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల పరాభవం నేపధ్యంలో సజ్జల తిరుగులేని పెత్తనానికి దాదాపుగా చెక్ పడిందన్న వాదన గట్టిగా వినిపించింది. అప్పటి వరకూ సజ్జలపై ఆగ్రహాన్ని, అసంతృప్తిని బయటకు చెప్పేందుకు జంకిన నేతలు ఇప్పుడు ఆయనపై బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. సజ్జల ముఖ్యమంత్రి కళ్ళకు గంటలు కట్టి, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని పార్టీ నేతలు అంటున్నారు. వైసీపీ ప్రస్తుతం ఎదుర్కుంటున సంక్షోభానికి సజ్జలే కారణమంటూ వేలెత్తి చూపుతున్నారు. దాదాపు ఇలాంటి ఆరోపణలే, ఇదే స్థాయి అసంతృప్తే జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం కూడా వెల్లువెత్తింది. ముఖ్యంగా బాలినేని వంటి వారు నేరుగా సజ్జలపై విమర్శలు గుప్పించారు. అప్పట్లో బాలినేనిని బుజ్జగించడానికి స్వయంగా రంగంలోకి దిగిన సజ్జల ఆ విషయంలో విఫలమై వెనుదిరిగిన సంగతి తెలిసిందే. తరువాత జగన్ జోక్యంతో బాలినేని కొంత మొత్త పడినా.. సజ్జలపై అప్పట్లో పార్టీలో వెల్లువెత్తిన అసంతృప్తి మాత్రం నివురుగప్పిన నిప్పులా అలాగే రగులుతూ వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నివురు తొలగిపోతోందన్న సంకేతాలు బలంగా కనిపించాయి. అయితే ఆ ఫలితాల అనంతరం నలుగురు పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హతలో అసమ్మతి గళం బహిర్గతం కాకుండా ఒకింత నెమ్మదించడానికి కారణమైంది. అయితే ఆ సమయంలో ఇంకా చాలా మందిలో అసమ్మతి గూడు కట్టుకుని ఉందన్న వార్తలు వెల్లువెత్తిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ చేశారనే ఆరోపణపై సస్పెన్షన్ కు గురైన నలుగురు ఎమ్మెల్యేలు, సజ్జలనే దోషిగా నిలబెడుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యే,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే,తాము టీడీపీకి అమ్ముడు పోయామని సజ్జల చేసిన ఆరోపణపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సజ్జల ఎవరు? అయన చరిత్ర ఏమిటి? అని ప్రశ్నించారు. అంతే కాదు, సజ్జలను వదిలే ప్రసక్తిలేదని, సస్పెన్షన్ గురైన ఇతర ఎమ్మెల్యేలతో చర్చించి, సజ్జలపై పరవు నష్టం దావా వేస్తామని అన్నారు. అలాగే ఆయన సజ్జల టార్గెట్’ గా తీవ్ర ఆరోపణలు సైతం చేశారు. చేశారు. అలాగే, సస్పెన్షన్ వెతుకు గురైన మహిళా ఎమ్మెల్యే శ్రీదేవి కూడా సజ్జల నుంచి తనకు ప్రాణహాని ఉందని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో తల దాచుకుంటున్న ఆమె ఏపీకి వెళ్ళాలంటే, సజ్జల ఏమి చేస్తారో అనే భయమేస్తోందని, అన్నారు. నిజానికి, చాల కాలంగా సజ్జల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయని, అయితే ఎందుకనో వాటిని అంతగా పట్టించుకోలేదని అంటారు. ముఖ్యంగా జగన్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజకీయంగా ఎదగకుండా చేయడంలో సజ్జల కీలక పాత్ర పోషించారనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అదలా ఉంటే ఇంతకాలం సరైన సమయం కోసం ఎదురు చూస్తునం సజ్జల బాధితులంతా ఏకమయ్యేందుకు, తెర వెనక ప్రయత్నాలు మొదలయ్యాయని అంటున్నారు. జగన్ నేరుగా దిగి బుజ్జగించకుండా ఉన్నట్లైతే ఇప్పటికే పార్టీలో సజ్జలపై భారీ స్థాయిలో తిరుగుబాటు జరిగి ఉండేదని కూడా పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. జగన్ రెడ్డి కుటుంబ సభ్యులు, వైఎస్ రాజశేఖర రెడ్డి ‘ఆత్మ’మిత్రులు, వైఎస్’కు సన్నిహితంగా మెలిగిన మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు కూడా వైసీపీలో సజ్జలపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు, నాయకులకు దన్నుగా నిలుస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదలా ఉంటే ఇటీవలి కాలంలో పార్టీలో, ప్రభుత్వంలో సజ్జల హవా ఒకింత తగ్గిందని కూడా పరిశీలకులు అంటున్నారు. జగన్ రెడ్డి కూడా సజ్జలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారనీ, త్వరలోనే సజ్జల పాత్ర కూడా పార్టీలో, ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి పాత్రలా నామమాత్రం అయిపోయినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాలే గట్టిగా చెబుతున్నాయి,
http://www.teluguone.com/news/content/sajjala-to-be-another-vijayasai-in-ycp-25-156369.html