వైసీపీలో సజ్జలకే మళ్లీ అందలం
Publish Date:Apr 15, 2025
.webp)
Advertisement
పీఏసీ కన్వీనర్‌గా మాజీ సలహాదారు
వైసీపీ ఓడిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టినట్టు కనిపించిన జగన్ మళ్లీ ఆయననే అందలమెక్కిస్తున్నారు. ఇక నుంచి పార్టీకి దిశానిర్దేశం చేసే బాధ్యత సజ్జల భుజాలపై పెట్టారు మాజీ సీఎం జగన్ తాజాగా నియమించిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కన్వీనర్‌గా సజ్జలను నియమించడంతో పార్టీలో ఆయన ప్రాధాన్యతను మరింత పెరిగినట్లైంది. పార్టీలో మళ్లీ సజ్జల పెత్తనమే కొనసాగనుండటంతో కొందరు సీనియర్ నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారంట. మరోవైపు సదరు కమిటీలో ముద్రగడ పద్మనాభంకు స్థానం కల్పించడం, దానికి ఆయన సంబరపడిపోతూ ప్రకటనలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని నియమించారు. మొత్తం 33 మంది సభ్యులతో వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్‌గా ఈ పీఏసీని ప్రకటించారు. ఎంపీలు అవినాశ్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు రోజా, విడదల రజని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేశ్, నారాయణస్వామి, అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు ముద్రగడ పద్మనాభం, సాకే శైలజానాథ్, నందిగం సురేశ్ తదితరులకు ఈ కమిటీలో స్థానం కల్పించారు.
ఈ రాజకీయ సలహాల కమిటీకి ఇప్పటికే పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్ గా నియమించారు. దాదాపు వైసీపీలో కీలక నేతలందరికీ ఈ కమిటీలో స్థానం లభించినట్లైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా అన్నీ తానై జగన్ ప్రభుత్వాన్ని నడిపించారు. ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లపై వైసీపీ నేతలు చెలరేగిపోయేవారు. ఆయన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాలో తన ప్రెస్‌మీట్‌లను వైరల్ చేసేవారని పోసాని కృష్ణమురళి స్వయంగా పోలీసు విచారణలో వెల్లడించారు. అంటే ప్రత్యర్ధులపై దాడుల నుంచి పార్టీ వ్యవహారాలన్నీ ఎలా డీల్ చేయాలనే విషయం వరకు అన్నీ సజ్జల రామకృష్ణా రెడ్డే స్వయంగా చూసుకునేవారన్నమాట. వైసీపీని వీడిన కోటంరెడ్డి, విజయసాయిరెడ్డి నుండి మొన్న పోసాని వరకూ అందరూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డి వంటివారు శల్య సారథ్యం చేస్తూ జగన్‌ను ముంచేస్తున్నారని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతుంటాయి.
గత ఎన్నికల్లో టికెట్ల పంపిణీ సమయంలో కూడా పలువురు నేతలు జగన్ కోటరీ అంటూ సజ్జలను టార్గెట్ చేశారు. అయితే వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత కూడా జగన్ మేల్కొలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటమి తర్వాత జగన్ సజ్జలని పక్కన పెట్టినట్లు కనిపించారు. అయితే విజయసాయిరెడ్డి వంటి ముఖ్యనేత పార్టీని వీడి వెళ్ళిపోవడం సజ్జలకు బాగా కలిసి వచ్చిందంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్కరికీ రూ. లక్షల చొప్పున ప్రభుత్వ సొమ్ము జీతభత్యాలుగా చెల్లిస్తూ 50 మందికిపైగా సలహాదారులని నియమించుకున్నారు. ఇప్పుడంత సీన్ లేకపోవడంతో 33 మంది సీనియర్ నేతలతో ఓ రాజకీయ సలహా కమిటీని ఏర్పాటు చేసుకున్నారంట. దానికి సజ్జల రామకృష్ణా రెడ్డిని సమన్వయకర్తగా నియమించారు. అంటే పార్టీలో ఇప్పటికే స్టేట్ కోఆర్డినేటర్‌గా ఉన్న సజ్జల పెత్తనం మళ్లీ మొదలైనట్లే అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని మెజారిటీ నేతలు భావిస్తున్నారట..
సకల శాఖల మంత్రి పాత్ర పోషిస్తూ సజ్జలే చాలా సందర్భాల్లో సీఎంలా వ్యవహరించరన్న టాక్ ఉంది.. విజయసాయిరెడ్డి కూడా పదేపదే కోటరీ అని విమర్శలు చేయడానికి అదే కారణమంటారు. ఓడిపోయిన తర్వాత సజ్జలను, కోటరీని పక్కన పెట్టినట్లు కనిపించిన జగన్ మళ్లీ ఆయనకు ప్రధాన బాధ్యతలు అప్పగించడం వైసీపీ సీనియర్లకు మింగుడుపడటం లేదంట.
జగన్ తాజా నిర్ణయంతో పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందంట. జగన్ లో మార్పు వచ్చింది కోటరీని దూరం పెడుతున్నారని భావించే లోపే ... మళ్లీ పాత బ్యాచ్ అందరికీ పగ్గాలు అప్పగిస్తుండడంతో, నిలకడలేని నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ పార్టీలో ఉండడం కంటే ఆపార్టీని వీడడమే మేలని మెజార్టీ నేతలు భావిస్తున్నారంట.
http://www.teluguone.com/news/content/sajjala-as-ycp-pac-convener-39-196280.html












