టీ కాంగ్రెస్‌లో మంత్రి పదవుల రచ్చ
Publish Date:Apr 15, 2025

Advertisement
జానా X రాజగోపాల్... ప్రేమ్‌సాగర్ X వివేక్
తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో చర్చలు జరిగాయి. ఇక అప్పటి నుంచి విస్తరణ .. అదిగో, ఇదిగో అన్న ప్రచారం చక్కర్లు కొట్టింది. ఆశావహులాంతా హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సామాజిక వర్గాల వారీగా నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు. అయితే విస్తరణ జాప్యం అవుతుండటంతో ఆశావహుల్లో అసంతృప్తి బయటపడుతోంది. తమకు పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని బహిరంగంగానే విమర్శలు చేస్తుండటం నాయకత్వానికి తలనొప్పిగా మారుతున్నదట. అలాంటి వారి జాబితాలో తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు చేరారు.
ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి అడ్డుపడుతున్నారని అక్కసు వెళ్లగక్కారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావ్ కూడా తనకు మంత్రి పదవి వస్తుందో రాదో అని అనుమానపడుతున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన నేత అన్యాయం చేస్తున్నారని బహిరంగంగానే స్టేట్‌మెంట్ ఇచ్చారు. ప్రేమ్‌సాగర్‌రావు మంచిర్యాల సభలో చేసిన ఆ వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. పార్టీలు మారి వచ్చిన వారికి పదవులు ఇస్తారా? కష్టకాలంలో పదేళ్ళు పార్టీని కాపాడిన వారికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
తన అభిమానులు కార్యకర్తలు పార్టీ మారి వచ్చిన వారికి మంత్రి పదవి వస్తుంది అనే వార్తలతో డిప్రెషన్ లో ఉన్నారని, కష్ట కాలంలో పార్టీ తో ఉన్న తమ పరిస్థితి ఏంటని తనను ప్రశ్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు ఈ కామెంట్స్ రాష్ట్ర కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టినట్లు అయ్యిదంట. పార్టీ కోసం పని చేసిన ప్రేమ్‌సాగర్ రావు ఎన్నికల ప్రచార సమయంలో ఇంద్రవెల్లి సభ మొదలు, మంచిర్యాలలో ఖర్గే సభలు విజయవంతం చేశారన్న గుడ్‌విల్ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రేమ్ సాగర్‌రావ్‌కి మంత్రి పదవి ఇవ్వకుంటే కార్యకర్తలకు ఎలాంటి మెసేజ్ పోతుందోనని కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనలో పడిందంట.
జిల్లా నుంచి ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌కు కేబినెట్ బెర్త్ ఖరారైందన్న ఉహగానాల నేపథ్యంలో ప్రేమ్‌సాగర్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయంశంగా మారింది. వివేక్ టార్గెట్ గానే ప్రేమ్ సాగర్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారనే టాక్ జిల్లాలో నడుస్తుందట. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన నేతలు మంత్రి పదవులు కోరుతున్నారని పరోక్షంగా వివేక్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారంటున్నారు.
ఇటీవల మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా సిఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ జనాభాకు అనుగుణంగా పదవులు దక్కలేదని ...ఈసారైనా మంత్రి వర్గ విస్తరణలో చోటు కల్పించాలని కోరారు. ఈ ఈక్వేషన్‌లను దృష్టిలో ఉంచుకుని వివేక్‌కు ఈసారి కేబినెట్ బెర్త్ ఖాయం అనే ప్రచారం జరగుతోంది. ఈ సందర్భంలో వివేక్ టార్గెట్‌గా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కామెంట్స్ చేశారంటున్నారు.
మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్ విస్తరణలో జరుగుతున్న జాప్యం నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యే బాహాటంగా ప్రభుత్వ పెద్దల సమక్షంలోనే విమర్శించే స్థాయికి రావడంతో నేతల మధ్య గ్యాప్ ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో అని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి.
http://www.teluguone.com/news/content/ruckus-over-ministerial-posts-in-congress-39-196282.html












