ఇచ్చిన మాట ప్రకారం కేసులు ఎత్తివేస్తున్నాం సబిత
Publish Date:Jan 25, 2012
Advertisement
హైదరాబాద్ : సభలో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తి వేయాలన్న డిమాండ్ నేపథ్యంలో బుధవారం ఆమె పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం సబిత మీడియాతో మాట్లాడుతూ ఇవాళ సాయంత్రానికల్లా 657 మందిపై ఉన్న కేసులను కొట్టివేస్తామన్నారు. ఇప్పటికే 560 కేసులు ఎత్తివేశామని, నెలాఖరుకల్లా 790 కేసులు ఎత్తివేస్తామన్నారు. కేసుల ఎత్తివేతపై సాధ్యమైనంత త్వరగా జివోను విడుదల చేస్తామని చెప్పారు. ఎత్తివేతలో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా పరిశీలిస్తున్నామని చెప్పారు. అందుకే ఆలస్యమౌతోందన్నారు. కాంగ్రెసు ఎమ్మెల్యేల దీక్షల వరకు ఉన్నకేసులను ప్రస్తుతం పరిశీలిస్తున్నామని చెప్పారు. సకల జనుల సమ్మె సమయంలో విద్యార్థులపై పెట్టిన కేసులను మరోసారి పరిశీలిస్తామని చెప్పారు. పోటీ పరీక్షల విషయంలో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హోంమంత్రి తెలిపారు. అమలాపురం ఘటనపై సాయంత్రం లోగా నివేదిక వస్తుందని, ఆ తర్వాత స్పందిస్తానని చెప్పారు.
http://www.teluguone.com/news/content/sabitha-indrareddy-24-11237.html





