సబిత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్టు.!
Publish Date:Jul 18, 2026
Advertisement
తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. భారత్ రాష్ట్ర సమితి తలపెట్టిన యువ సంగ్రామ సదస్సు సభకు ముందు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన ఈ భారీ యువజన సభ కంటే ముందే బీఆర్‌ఎస్ కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ పి. సబితా ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ పరిణామంపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ, వాటిని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ యువ సంగ్రామ సభకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల మందికి పైగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు పార్టీ కార్యకర్తలు హాజరవుతారని బీఆర్ఎస్ అంచనా వేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం (జులై 18) మధ్యాహ్నం ఒంటి గంట లోపు ఈ సభను ముగించాలని భావించారు. అయితే.. తొలుత ఈ సభకు అనుమతి ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించినప్పటికీ, బీఆర్‌ఎస్ నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం, తెలంగాణ హైకోర్టు కొన్ని నిబంధనలతో ఈ బహిరంగ సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభకు అనుమతి ఇస్తూ.. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసుకోవాలని, అలాగే హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిని ఎక్కడా దిగ్బంధించకూడదని నిర్వాహకులకు షరతులు విధించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం సభను ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. ఉదయాన్నే నేతలను హౌస్ అరెస్ట్ చేయడం పట్ల బీఆర్ఎస్ మండిపడుతోంది. కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ఈ హౌస్ అరెస్టులు రాజ్యాంగ విరుద్ధమంటూ విమర్శలు గుప్పించింది. BRS leaders house arrest, Yuva Sangrama Sabha, Telangana politics latest updates, Saroornagar stadium BRS meeting
http://www.teluguone.com/news/content/sabitha-and-rs-praveen-kumar--house-arrest-36-226365.html





