యూపీలో వన్స్‌మోర్.. మండలి ఎన్నికల్లోనూ బీజేపీదే హవా..
Publish Date:Apr 13, 2022
Advertisement
ఇటీవల జరిగిన ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా అద్భుత విజయం సాధించి, మూడింట రెండు వంతుల మెజారిటీతో వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ, ఏప్రిల్ 9న జరిగిన శాసన మండలి ఎన్నికల్లోనూ మరోసారి సత్తా చాటుకుంది. రాష్ట్రంలోని 36 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగగా, తొమ్మిది స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 27 స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. ఎన్నికలు జరిగిన 27 స్థానాలలో 22 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. దీంతో 36 కు 33 స్థానాలను గెలుచుకుని బీజేపీ ఆధిక్యతను నిలుపుకుంది. కాంగ్రెస్, బీఎస్పీ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ పోటీచేసిన స్థానాలన్నిట్లో ఓడిపోయింది. అయితే, బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారాణాసి లోక్ సభ నియోజక వర్గం పరిధిలోని శాసన మండలి స్థానంలో ఓటమి చవిచూసింది. కాగా, బీజేపీ ఓటమి చవిచూసిన మిగిలిన మూడు స్థానలో వారాణాసి సహా రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించారు. ఒక స్థానంలో జనసత్తా దళ్ (లోక్ తాంత్రిక్ ) అభ్యర్ధి విజయం సాధించారు. వారాణాసి మండలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి అన్నపూర్ణ సింగ్ 4,234 ఓట్లతో తేడాతో ఘన విజయం సాధించారు. బీజేపీ తరఫున పోటీచేసిన సుధామ పటేల్ 170 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా, ఎస్పీ అభ్యర్థి 345 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. కాగా, అయోధ్య, గోరఖ్పూర్, ఉన్నావ్, రాయ్బరేలీ సహా అనేక చోట్ల బీజేపీ మెజార్టీ సాధించింది. ఉత్తర్ప్రదేశ్ శాసనమండలి ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీని గెలిపించిన ఉత్తర్ప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, తాజా ఫలితాలతో 100 మంది సభ్యులు గల ఉత్తర్ప్రదేశ్ శాసనమండలిలో, బీజేపీ సంఖ్యా బలం ఒక్కసారిగా 34 నుంచి 67కు పెరిగింది. మండలిలో తొలిసరిగా కమల దళం తిరుగు లేని ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. దీంతో యూపీ అసెంబ్లీ ఉభయ సభల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించింది. అదలా వరసగా రెండవసారి అధికారం హస్త గతం చేసుకున్న ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్, దూకుడు పెంచారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు బుల్డోజర్ బాబా అంటూ చేసిన విమర్శలను నిజం చేస్తూ, నేర చరితుల ఇళ్ళ మీదకు బుల్డోజర్ పంపి,వారి ఆట కట్టిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ruling-bjp-grabs-council-seats-in-up-39-134312.html





