పెళ్లికి అనుకోని అతిథిగా సజ్జనార్.. ఆర్టీసీ బస్ బుక్ చేస్తే సర్ప్రైజ్..
Publish Date:Nov 12, 2021
Advertisement
వారి పెళ్లికి అనుకోని అతిథి వచ్చారు. ఆయనేమీ మామూలు గెస్ట్ కాదు. మాజీ పోలీస్ కమిషనర్, ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ సజ్జనార్ ఆ నవజంటను ఆశీర్వదించారు. మంచి బహుమతితో శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ పిలవని పెళ్లికి సజ్జనార్ ఎందుకు వెళ్లినట్టు? స్పెషల్ గిఫ్ట్ ఎందుకు ఇచ్చినట్టు? ఆ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ పెళ్లి బృందం చేసిన ఓ పనే.. సజ్జనార్ అంతటి వారు వచ్చేలా చేసింది. పెళ్లికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్ బుక్ చేసుకున్నారు వారు. యాదగిరిగుట్ట డిపో నుంచి రెండు బస్సులను అద్దెకు తీసుకుని.. కొంపల్లిలో జరిగే పెళ్లికి బంధువులందరినీ తీసుకెళ్లారు. ఇలా పెళ్లి వేడుకలకు ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకోవడాన్ని ప్రోత్సహించేందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్వయంగా ఆ మ్యారేజ్‌కి విచ్చేసి.. వధూవరులకు ఆ బస్ డ్రైవర్, కండెక్టర్ చేతుల మీదుగా గిఫ్ట్ ఇప్పించారు. ఆ నవదంపతులు ఆకుల భరత్‌కుమార్, సౌమ్యలు ఫుల్ ఖుషీ అయ్యారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ వచ్చాక సంస్థకు రాబడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు తక్కువ ధరకు, ఎలాంటి డిపాజిట్ లేకుండా ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవచ్చని సూచించారు. ఆర్టీసీ సిబ్బందే ఇంటి దగ్గరికి వచ్చి బుకింగ్ చేసుకునే విధానం తీసుకొచ్చారు. ఇలా ఆర్టీసీని ప్రజలకు చేరువ చేసి.. రాబడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే.. రెండు బస్సులను బుక్ చేసుకున్న పెళ్లిబృందాన్ని, ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు సజ్జనార్. అంతా బాగానే ఉంది కానీ.. టికెట్ ధరలు పెంచే ప్రయత్నాలు చేస్తుండటమే బాలేదంటున్నారు ప్రయాణీకులు.
http://www.teluguone.com/news/content/rtc-md-sajjanar-surprise-visit-to-wedding-39-126231.html





