యుద్దానికి ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్?
Publish Date:Apr 29, 2025
Advertisement
పహల్గాం ఉగ్రదాడి నేపధ్యంలో పాకిస్థాన్ తో మరో యుద్ధం తధ్యమనే సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా మీడియాలో అయితే.. యుద్ధం వచ్చినట్లే కథనాలు వస్తున్నాయి. అయితే ఇలా యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయి అంటూ వస్తున్న మీడియా కథనాల్లో ఆధారాలకంటే, ఊహాగానలే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరో వంక పాకిస్థాన్ ఉలికి పాటు చూస్తుంటే.. పాక్ నేతల్లో యుద్ద భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అలాగే పాక్ మీడియాలో వస్తున్న కథనాలు గమనిస్తే.. యుద్ధానికి ముందే పాక్ నేతలు పలాయన మంత్రం జపిస్తున్నట్లు అనిపిస్తోందని అంటున్నారు. నిజానికి ఇప్పటికే ఆర్థికంగా అన్ని విధాల చితికి పోయిన పాకిస్థాన్ యుద్ధంచేసే స్థితిలో లేదని అంటున్నారు. నిజానికి పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఎంత అద్వాన్నంగా ఉన్నదో ఆ దేశ ప్రధాని షేహబాబ్ షరీఫ్ స్వయంగా చెప్పుకున్నారు. అవును ప్రపంచ దేశాలు తమను బిచ్చగాళ్ళను చుసినట్లు చూస్తున్నాయని షరీఫ్ చెప్పుకున్నారు. ప్రధాని చెప్పిందే నిజం అయితే ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత భయంకరంగా, బాధాకరంగా వుందో వేరే చెప్పవలసిన అవసరం లేదు. అలాగే పాక్ లో బ్రెడ్ ముక్క, రొట్టె ముక్క రేట్లు, పాలు, పెరుగు ధరలు మండి పోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ద్రవ్యోల్బణం ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తోందని అంటున్నారు. అందుకే పాకిస్థాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి అణ్వాయుధ బూచిని చూపించి అయినా యుద్ధం రాకుండా అడ్డుకునే విఫల ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. సరే పాక్ ప్రగల్బాలు ఎలా ఉన్నా.. భారత దేశం, మోదీ ప్రభుత్వం నిజంగా యుద్ధానికి సిద్ధంగా వుందా అంటే ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు రోజులకు బీహార్ మధుబనిలో చేసిన ప్రసంగంలో ఉగ్రదాడులకు తెగబడిన ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా.. వెతికి వెంటాడి శిక్షిస్తామని గట్టి హెచ్చరిక చేయడంతో పాటుగా ఉగ్రవాదులకు సహకరించిన వారినీ వదిలేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రధాని మోదీ ఉగ్రవాదులకు, ఉగ్రవాదానికి, ఆఖరి మజిలీగా మిగిలిన కొద్ది పాటి భూ భాగాన్ని మట్టిలో కలిపేస్తాం అని చేసిన హెచ్చరిక పాకిస్థాన్ ను ఉద్దేశించి చేసినదే అంటున్నారు. అంటే మోదీ యుద్ద భేరి మొగించినట్లే అనుకోవచ్చని అంటున్నారు. అదలా ఉంచితే.. తాజాగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్య కూడా యుద్దానికి గ్రీన్ సిగ్నల్ గానే భావించవలసి ఉంటుందని అంటున్నారు. మోహన్ భగవత్ ఢిల్లీలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమలో ప్రసంగిస్తూ.. భారత దేశం పొరుగే వారికి అపాయం చేయదు. హానీ తలపెట్టదు. కానీ రాక్షసత్వం ప్రబలితే మాత్రం భారత్‌కు ప్రతిస్పందించడం మినహా మరో మార్గం ఉండదు. శతృవును వదిలి పెట్టదు అని స్పష్టం చేశారు. అంతే కాదు ప్రజలకు రక్షణ కల్పించడం పాలకుల ప్రధాన కర్తవ్యం. పాలకులు ఆ బాధ్యతను నిర్వహించాలంటూ మోదీ ప్రభుత్వానికి కర్తవ్య బోధ చేశారు. హిందూమతం మూల సూత్రాల్లో అహింసే ప్రధానమైనదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, స్వీయరక్షణ కోసం దుర్మార్గులను దీటుగా ఎదుర్కోవాలనేది కూడా హిందూ ధర్మంలో ఓ కీలక అంశమని వివరించారు. దుర్మాగులకు గుణపాఠం చెప్పడం కూడా ఇందులో భాగమేనని అన్నారు. ముఖ్యంగా అమాయకులను మతం అడిగి మరీ కాల్చి చంపారు. ద్వేషం, హింస,పగలకు పాల్పడడమే కాదు.. ఇతరుల ద్వేషాన్ని, పగను, హింసను మౌనంగా భరించరాదు.. అదే హిందూ ధర్మం అని అని పేర్కొన్నారు.
కాగా.. ప్రధాని మోదీ మధుబని ( బీహార్) లో చేసిన వ్యాఖ్యలు, ఢిల్హిలో మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఒకే అర్థం ఇస్తున్నాయని అంటున్నారు. యుద్దానికి మోదీ ప్రభుత్వం సిద్దంగా వుంది.. అందుకు ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిది. అయితే.. అదే అంతిమ నిర్ణయమా, అంటే కాదని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/rss-green-signal-to-war-25-197129.html





