మీర్‌పేట్‌లో రౌడీ షీటర్ సూరిని హత్య చేసిన బామ్మర్ది..!
Publish Date:Jul 21, 2026
Advertisement
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ నందనవనం సూరి దారుణ హత్యకు గురికావడం సంచలనంగా మారింది. గతంలో పలు హత్యలు, ఇతర నేర కేసుల్లో నిందితుడిగా ఉన్న సూరిపై పాత కక్షతోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సూరిపై వరంగల్, హైదరాబాద్, మల్కాజిగిరి కమిషన రేట్‌ల పరిధిలో హత్య, దాడులు, బెదిరింపులు తదితర కేసులు నమోదయ్యాయి. గతంలో తన భార్యతో పాటు బావమరిది సల్మాన్ హత్య కేసుల్లో కూడా అతడు నిందితుడిగా ఉన్నాడు. అతని నేర చరిత్ర దృష్ట్యా నగర బహిష్కరణ కూడా అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తన రెండో భార్య తమ్ముడు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు సూరి నందనవనానికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న బావమరిది ఆఫ్రూజ్ (హత్యకు గురైన సల్మాన్ సోదరుడు) అక్కడికి చేరుకున్నాడు. ముందుగా సూరి కళ్లలో పేపర్ స్ప్రే చల్లి, ప్రతిఘటించే అవకాశం లేకుండా చేసిన అనంతరం కత్తితో విచక్షణారహితంగా పలుమార్లు దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సూరి రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులతో పరిశీలనలు నిర్వహించారు. హత్య అనంతరం నిందితుడు పరారైనట్లు సమాచారం. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. సూరిపై నమోదైన పాత హత్య కేసులు, ముఖ్యంగా సల్మాన్ హత్య వ్యవహారానికి ప్రతీకారంగానే ఈ దాడి జరిగి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడికానున్నాయి. Rowdy sheeter Suri murdered in Meerpet, Ranga Reddy District, Nandanavanam Suri, salman, Crime news, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Hyderabad police
http://www.teluguone.com/news/content/rowdy-sheeter-suri-murdered-in-meerpet-36-226604.html





