జగన్‌కు రోజా ముద్దు.. మంత్రులు వంగివంగి దండాలు.. ప్రమాణం పదనిసలు..
Publish Date:Apr 11, 2022
Advertisement
ఎన్నాళ్లో వేచిన రోజు.. రోజాకు ఆవిష్కృతమైంది. మూడేళ్లుగా కలలు కంటున్న మంత్రి పదవి వరించింది. జగనన్నను నమ్ముకున్నందుకు.. లేటైనా మినిస్టర్ పోస్ట్ వెతుక్కుంటూ వచ్చింది. పెద్దిరెడ్డి పెద్ద కిరికిరే పెట్టినా.. జగన్‌రెడ్డి రోజాకి ఇచ్చిన హామీ నెరవేర్చారు. మంత్రి పదవిపై మాట నిలబెట్టుకున్నారు. కొన్ని రోజులుగా ఆలయాల చుట్టూ తిరిగినందుకు.. దేవుళ్లందరికీ మొక్కినందుకు ఫలితం లభించింది. అందుకే, ఆర్కే రోజా అనే నేను.. అంటూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే రోజమ్మ పులకించిపోయారు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అదే సంతోషంలో జగన్ కాళ్లకు నమష్కరించారు. ప్రేమతో జగనన్న చేయిపై ముద్దాడారు. జగన్ సైతం ఆమె తలపై చేయి పెట్టి.. నేనున్నానంటూ ఆశీర్వదించారు. ఈ సీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికే హైలెట్ అంటున్నారు. రోజానే కాదు.. పలువురు మంత్రులు సైతం సీఎం జగన్‌పై తమ భక్తిని, విధేయతను బహిరంగంగానే చాటుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కొందరు మంత్రులు.. సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్‌కు నమస్కరించి వెళ్లిపోగా.. మరికొందరు మాత్రం జగన్ కాళ్లకు మొక్కి.. సదా మీ సేవలో అన్నట్టు వ్యవహరించడం ఆసక్తికరంగా మారింది. ప్రమాణస్వీకారం అనంతరం మంత్రి నారాయణస్వామి సీఎం జగన్ కాళ్లను తాకి నమస్కరించారు. మంత్రి ఉష శ్రీచరణ్ సైతం సీఎం కాళ్లకు మొక్కారు. మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, జోగి రమేశ్ మరింత విధేయతతో మోకాళ్లపై పడి మరీ నమస్కరించారు. బహుషా, తమది మంత్రి స్థాయి కాకున్నా.. మంత్రి పదవి ఇచ్చినందుకో..మరెందుకో.. అంతటి కృతజ్ఞత చాటుకున్నారని అంటున్నారు. ఇంతకీ వారిది వినయమా? అతివినయమా!? అనే అనుమానమూ వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/roja-kiss-to-cm-jagan-39-134235.html





