చెన్నై డ్రామా సక్సెస్.. రోజా దెబ్బకు దిగొచ్చిన జగన్!
Publish Date:Sep 14, 2024
Advertisement
మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత రోజా దెబ్బకు ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దిగొచ్చారు. దీంతో రోజా ఆడిన చెన్నై డ్రామా సూపర్ సక్సెస్ అయిందని నగరి నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. ఇంతకీ రోజా ఏం ప్లాన్ చేశారు? పెద్దిరెడ్డి వర్గాన్ని కాదని రోజాకే జగన్ జై కొట్టడానికి కారణమేంటి? అనే విషయాల్లోకి వెడితే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగుదేశంలో ఉన్నంత కాలం అందరూ మెచ్చేలా రాజకీయాలు చేసిన ఆర్కే రోజా.. వైసీపీలో చేరిన తరువాత తోటి మహిళల చేత కూడా ఛీ అనిపించుకునేలా రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ హయాంలో రోజా మాట తీరుతో మహిళలు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చంద్రబాబు నాయుడు, లోకేశ్, పవన్ కల్యాణ్ సహా పలువురు నేతలపై రోజా అసభ్యకర పదజాలంతో విమర్శలు చేస్తూ వచ్చారు. మహిళా నేతననే విషయాన్ని మరిపోయి అధికార అహంతో రెచ్చిపోయారు. ఈ క్రమంలో రోజా తీరుపై వైసీపీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా వ్యవహారశైలి నచ్చని నగరి నియోజకవర్గంలోని కొందరు వైసీపీ నేతలు ఆమెపై పలు సార్లు జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలోనూ ఆమెకు టికెట్ ఇస్తే ఓడిపోవటం ఖాయమని, వేరే వారికి నగరిలో టికెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కానీ, జగన్ మాత్రం రోజాకే టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగానేకాక.. నగరి నియోజకవర్గంలోనూ వైసీపీ ఓడిపోయింది.
వైసీపీ ప్రభుత్వం కొనసాగినన్ని రోజులు నగరి నియోజకవర్గంలో రోజా పెద్దఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మంత్రి హోదాను అడ్డుపెట్టుకొని తన సోదరులతో కలిసి భూదందాకు పాల్పడినట్లు విమర్శలు ఉన్నాయి. అంతేకాదు.. క్రీడల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో శాప్ మాజీ ఛైర్మన్ సిద్ధార్థ రెడ్డితో కలిసి ఆడుదాం ఆంధ్ర, ‘సీఎం కప్’ల పేరుతో నిర్వహించిన కార్యక్రమాల ద్వారా రూ. 100 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికితోడు నగరి నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల పట్ల అమర్యాదగా ప్రవర్తించారన్న విమర్శలూ ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలోని ముఖ్య నేతలంతా రోజాకు వ్యతిరేక వర్గంగా మారిపోయారు.
నగరికి చెందిన వైసీపీ నేతలు కేజే కుమార్, ఆయన సతీమణి, మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ కేజే శాంతి సైతం రోజా తీరుతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, తన నియోజకవర్గంలో తనను ఇబ్బంది పెట్టేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నిస్తున్నారని గతంలో రోజా అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఎన్నికల సమయం దగ్గర పడినా రోజా తీరులో మార్పురాకపోవడంతో పాటు.. ఆమెను వ్యతిరేకించిన సొంత పార్టీ నేతలను బుజ్జగించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో గత ఎన్నికల్లో రోజా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. రాష్ట్రంలోనూ ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆమె చెన్నై వెళ్లిపోయారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత మూడు నెలలుగా రోజా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె చెన్నై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని విస్తృత ప్రచారం జరిగింది. తమిళనాడులో సినీ హీరో విజయ్ కొత్త పార్టీని పెట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో రోజా ఆంధ్రా రాజకీయాలకు గుడ్ బై చెప్పి, వైసీపీకి రాజీనామా చేసి విజయ్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఈ వార్తలను రోజా ఖండించకపోగా.. ఆమె ట్విటర్ అకౌంట్ లో జగన్ మోహన్ రెడ్డి బొమ్మను తొలగించారు. దీంతో ఆమె చెన్నై రాజకీయాల్లోకి వెళ్లడం ఖాయమన్న భావనకు వైసీపీ నేతలు కూడా వచ్చేశారు. ఇదే సమయంలో ఆంధ్రా రాజకీయాల్లోనే కొనసాగాలని జగన్ రోజాకు సూచించారని, ఈ క్రమంలో ఆమె కొన్ని షరతులు పెట్టినట్లు గత నెల రోజుల క్రితం ప్రచారం జరిగింది. రోజా షరతులకు జగన్ మోహన్ రెడ్డి ఒప్పుకోవటంతో గత పది రోజుల నుంచి ఆమె కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోజా.. ఈవీఎంల వల్లనే వైసీపీ ఓడిపోయిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. వైసీపీలోనే తాను కొనసాగుతానని, నగరి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని రోజా చెప్పారు.
రోజా పెట్టిన షరతుల ప్రకారమే.. నగరి నియోజకవర్గంలో ఆమెకు వ్యతిరేక వర్గంగా ఉన్న వైసీపీ నేతలు కేజే కుమార్, ఆయన సతీమణి, మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ కేజే శాంతిలను జగన్ మోహన్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నగరి నియోజకవర్గంలో రోజా, కేజే దంపతుల మధ్య మొదటి నుంచి వార్ నడిచింది. ఒకే పార్టీలో ఉన్నా.. వేర్వేరుగా కార్యక్రమాలు చేపట్టేవారు. రెండు వర్గాల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, గత ఎన్నికల్లో కేజే దంపతులు వ్యతిరేకంగా పనిచేయడం వల్లనే తాను ఓడిపోయానని, వారిని పార్టీని తొలగించాలని జగన్ కు రోజా షరతు పెట్టడంతోనే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు నగరి నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది.
దీంతో చెన్నై డ్రామాతో రోజా తన పంతాన్ని నెగ్గించుకున్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రోజా కోసం కేజే దంపతులను సస్పెండ్ చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీలోని కొందరు నేతలు తప్పుబడుతున్నారు. రోజాను సంతృప్తి పర్చడానికి వారిని సస్పెండ్ చేయడంకన్నా.. రోజాను పట్టించుకోకుండా నగరిలో రాజకీయంగా మంచి పట్టున్న కేజే దంపతులకే ఇంచార్జ్ పోస్టు ఇస్తే బాగుండేదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. మొత్తం మీద చెన్నై డ్రామాతో రోజా జగన్ మెడలు వంచి తన పంతాన్ని నెగ్గించుకున్నారని చెప్పొచ్చు.
http://www.teluguone.com/news/content/roja-chennai-drama-success-39-184840.html