నేతల మధ్య సయోధ్య.. శ్రేణుల కీచులాట.. కూటమి పార్టీల్లో వింత ముచ్చట!
Publish Date:Oct 30, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మూడు పార్టీల నేతల మధ్యా సయోధ్య చక్కగా కుదిరింది. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అన్ని నిర్ణయాలలోనూ సమష్టిగా ముందుకు సాగుతోంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతల మధ్య సయోధ్యం కుదిరింది. పాలన సజావుగా సాగుతోంది. అయితే క్షేత్ర స్థాయిలో ఆయా పార్టీల శ్రేణులు కార్యకర్తల మధ్య మాత్రం ఆటువంటి సయోధ్య కనిపించడం లేదే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. క్యాడర్ బలం అంతగా లేని బీజేపీని పక్కన పెడితే కూటమి భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, జనసేన శ్రేణుల మధ్య కీచులాటలు మొదలయ్యాయి. సమష్టిగా పని చేయాలని రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమతమ పార్టీ క్యాడర్ కు స్పష్టమైన ఆదేశాలిచ్చానా పరిస్థితిలో మార్పు రావడం లేదు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి కొలువుదీరి నాలుగు నెలలు పూర్తవుతోంది. తొలి రోజుల్లో ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగానే పరిస్థితులు కనిపించాయి. అయితే ఇటీవలి కాలంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్యా తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. సమష్టి తత్వం కనుమరుగైంది. రాష్ట్రం అంతటా పరిస్థితి ఇలాగే ఉందని కాదు కానీ, పలు చోట్ల ఇరు పార్టీల కార్యకర్తల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఒకటి రెండు చోట్ల ఇది బహిర్గతం అయ్యింది. ఇంకా పలు చోట్ల పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన దెందులూరు నియోజవర్గంలో తెలుగుదేశం జనసేన కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తెలుగుదేశం నాయకుడు సైదు గోవర్ధన్ ఇటీవల జనసేనానిపై చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించాయి, రాజకీయ రగడకు దారి తీశాయి. స్థానిక నాయకులు సర్ది చెప్పినా ఫలితం లేకపోయింది. క్షణమే టీడీపీ నేతను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనసేన నేతలు పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఉమ్మడి ఒంగోలు లోనూ తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇటీవల జిల్లాలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున జనసేనలోకి వలసలు జరిగాయి. అయితే జనసేనాని కూటమి ధర్మాన్ని విస్మరించి బాలినేనిని వంటి నేతలను పార్టీలో చేర్చుకోవడాన్ని తెలుగుదేశం శ్రేణులు తప్పుపడుతున్నాయి. అలాగే అనంతపురం అర్బన్ లో కూడా జనసేన, తలుగు దేశం పార్టీల విభేదాలు రచ్చకెక్కాయి. వీటిని చక్కదిద్దుకోకుంటే మున్ముంది మరిన్ని సమస్యలు ఉత్పన్నమవ్వడం ఖాయమన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నది.
http://www.teluguone.com/news/content/rift-between-tdp-and-janasena-cadre-25-187669.html