రేవంత్ దెబ్బకు కాంగ్రెస్‌లో కట్టప్పలు విలవిల!
Publish Date:Oct 5, 2024
Advertisement
కాంగ్రెస్ పార్టీలో కట్టప్పల జాబితా ఎక్కువే ఉంటుంది.. ఇప్పుడనే కాదు.. గతంలోనూ ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. కాంగ్రెస్ లో ఉంటూ పార్టీలో సీనియర్ నేతలమనే ట్యాగ్ తగిలించుకొని ఇతర పార్టీలకు సహాయ సహ కారాలు అందించడం వారికి అలవాటుగా మారింది. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావం తరువాత కొందరు సీనియర్ నేతలు కేసీఆర్ తో సన్నిహితంగా ఉంటూ వచ్చారు. పైకి మాత్రం తాము కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా ఉంటున్నాం, పార్టీకి ఎనలేని సేవలు అందించామని చెప్పుకుంటూ పెత్తనం చెలాయించేవారు. అధికారంలోలేని పదేళ్ల కాలంలో వీరి ఆటలు సాగాయి. కానీ, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత తెర వెనుక పార్టీకి ద్రోహం చేస్తున్నవారికి చెక్‌పెడుతూ వస్తున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో కొందరు పార్టీ సీనియర్లు కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంతో పాటు.. తమ సన్నిహితులకు ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు ఇప్పించుకొని లబ్ధిపొందారు. రేవంత్ రెడ్డి అలాంటి వారి గుట్టును రట్టు చేస్తుండటంతో లబోదిబోమంటున్నారు. రేవంత్ సీఎం అయిన తరువాత సీనియర్, జూనియర్లను కలుపుకొని పోతూ పార్టీ బలోపేతంతోపాటు..ప్రభుత్వంలోనూ వారి సేవలను వినియోగించుకుం టున్నారు. కానీ, కొందరి తీరులో మాత్రం మార్పురావడం లేదని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హైదరాబాద్ నగరంలోని చెరువులు, నాళాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత జరిగింది. పార్టీల కు అతీతంగా, పలుకుబడి కలిగినవారు అని చూడకుండా చెరువు, నాళాలు ఆక్రమించి నిర్మించిన ఇళ్లను హైడ్రా కూల్చివేస్తోంది. దీనికితోడు చెరువులను ఆక్రమించి నిర్మాణం చేసిన ఫామ్ హౌస్‌లను కూడా కూల్చేస్తామని రేవంత్ పలుసార్లు ప్రస్తావించారు. మరోవైపు.. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నదీపరీవాహక ప్రాంతంలోని ఇళ్లను మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ కూల్చివేస్తోంది. మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా రివర్ బెడ్ పరిధిలో సుమారు 55 కిలోమీటర్ల పరిధిలో 40 వేల ఆక్రమణలను కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. చాదర్‌ఘాట్ మూసీ పరీవాహక ప్రాంతాల్లోని మూసానగర్, రసూల్‌పుర, వినాయక్‌నగర్ పరిసరాల్లో ఇళ్లకు రెవెన్యూ అధికారులు మార్కిం గ్ చేశారు. ఇందులో స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వారి ఇళ్ల కూల్చివేతలు చేపట్టారు. అయితే, కొందరు స్థానికులు మూసి పరివాహక ప్రాంతంలోని తమ ఇళ్లను కూల్చివేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు సైతం మూసీ పరివాహక ప్రాంతాల్లోని బాధితులకు అండగా నిలవడంతో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లను కూల్చేస్తే చూస్తూ ఊరుకోబోమని, ఇళ్లను కూల్చాలంటే ముందుగా బుల్డోజర్లు తమపై నుంచి పోనివ్వాలంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లోని నేతలు సవాళ్లు చేశారు. దీంతో మూసి ప్రాంతంలో కూల్చివేతల వ్యవహారం రాజకీయంగా పెద్ద రచ్చకు దారితీసింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ పనుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. ఇళ్లు నష్టపో యిన వారికి డబుల్ ఇళ్లు ప్రభుత్వం కట్టించి ఇస్తుందని, పరిహారం కూడా అందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తామని, అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో అనేకమంది పెద్దలు ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని చెబుతూ వారి పేర్లను కూడా ప్రస్తావించారు. ఆయన అలా ప్రస్తావించిన పేర్లలో బీఆర్‌ఎస్ నేతలతో పాటు, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రాంచందర్‌రావు పేరు కూడా ఉంది. కేవీపీ అక్రమంగా ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ పేరు నే రేవంత్ ఉటంకించడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ కేవీపీ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీలో తాను సీనియర్ లీడర్ని అని ఆ లేఖలో చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. పార్టీకి చెడ్డ పేరు వస్తే, తన కాంగ్రెస్ రక్తం సహించదు అని పేర్కొన్న కేవీపీ, తన ఫామ్ హౌస్‌కు అధికారులను పంపించండి.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణం ఉంటే మార్క్ చేయించండి, సొంత ఖర్చులతో ఆ నిర్మాణాలను కూల్చివేయిస్తా అని ఆ లేఖలో స్పష్టం చేశారు. అయితే, కేవీపీ లేఖ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ నైన నా ఫామ్ హౌస్ నే కూల్చేస్తావా అన్న హెచ్చరికను రేవంత్ కు పంపినట్లు ఉందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులే అంటున్నాయి. అయితే అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మాణం అంటూ రేవంత్ కేవీపీ పేరును ప్రస్తావించడం వెనుక పెద్దకారణమే ఉందన్న చర్చ కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో కేవీపీ రామచంద్రరావు హవా నడిచిం దన్న ఆరోపణలున్నాయి. వాటిని రేవంత్ నమ్ముతున్నారు. ముఖ్యంగా కాంట్రాక్టులు.. ఇతర విషయాల్లో కేసీఆర్ కు కేవీపీ అన్ని విధాలుగా సహకారం అందించారనీ, ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు ఉండటంతోనే రేవంత్ కేవీపీ పేరు ప్రస్తావిస్తూ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం తప్పదని హెచ్చరించారనీ పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో కూడా రేవంత్ కేవీపీపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయాన్నిగుర్తు చేస్తున్నారు. కేవీపీ, కేసీఆర్‌ది ఒకే సామాజికవర్గం కావడంతో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేవీపీ కేసీఆర్ కు అన్ని విధాలుగా సహకరించారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఇప్పటికే కేవీపీ వ్యవహారాన్ని రేవంత్ అధిష్ఠానం దృష్టికి తీసు కెళ్లారని.. బీఆర్ ఎస్ హయాంలో కేవీపీ కేసీఆర్ కు ఏ విధంగా అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేశారో వివ రించారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హైకమాండ్ అనుమతితోనే రేవంత్ అక్రమ నిర్మాణాలు చేసిన వారిలో కేవీపీ కూడా ఉన్నారని వెల్లడించారని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ లో సీనియర్లుగా చలామణి అవుతూ పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారికంగా సహకారం అందించిన కొందరు సీనియర్ల ను రేవంత్ టార్గెట్ చేశారనీ, వారిలో కేవీపీ కూడా ఒకరన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. మొత్తానికి కేవీపీ ఎపిసోడ్ తో కాంగ్రెస్ పార్టీ లోని కట్టప్పల్లో ఆందోళన వ్యక్తమవుతోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/revanth-targets-congress-seniours-who-helped-kcr-when-brs-in-power-39-186312.html