పార్టీ, ప్రభుత్వంపై పట్టుబిగించిన సీఎం రేవంత్.!
Publish Date:Sep 7, 2026
Advertisement
తెలంగాణ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు బిగిస్తున్నారు. ఇటీవల జరిగిన కీలక పరిణామాలు, ముఖ్యంగా మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్త్ రఫ్ చేయడం ద్వారా అధిష్ఠానం వద్ద తన పలుకుబడి ఇసుమంతైనా తగ్గలేదని నిరూపించుకున్న రేవంత్ రెడ్డి, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కూడా గ్రిప్ సాధించారు, కొండా సురేఖ బర్త్ రఫ్ తరువాత.. పార్టీలో రేవంత్ వ్యతిరేకులలో, మరీ ముఖ్యంగా అసమ్మతి, అసంతృప్తి నేతల తీరులో, వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు గోచరిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ బర్త్ రఫ్ అనంతరం పరిణామాలు చాలా వేగంగా మారాయి. ఇప్పటివరకు మంత్రి పదవి దక్కలేదని బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడమే కాకుండా, రేవంత్ ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రిపదవి విషయంలో హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమని తాజాగా విస్పష్టంగా వెల్లడించి తనలో మార్పును తెలియజేశారు. తనకు మంత్రిపదవి విషయంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాకుండా.. కొండా బర్త్ రఫ్ కు ముందు వరకూ.. రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలతో అనుచిత సంబోధనలతో విరుచుకుపడిన కొండా సుశ్మిత.. తన తల్లి కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన తరువాత మీడియా ముందు భోరుమని విలపించారు. తాను చేసిన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సబబు కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షీ నటరాజన్ ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. తన లండన్ పర్యటన కారణంగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆమె చెబుతున్నా.. రాష్ట్ర కాంగ్రెస్ లో అసమ్మతి జోరందుకోకుండా నివారించడంలో వైఫల్యం కారణంగా పార్టీ హైకమాండే ఆమెను తప్పించిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాలలోనే జోరుగా సాగుతోంది. ఈ నెల 13న ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ప్రత్యేక కోర్సు అభ్యసించేందుకు లండన్ బయలు దేరుతున్నారు. కనీసం ఆమె పది నెలల పాటు రాష్ట్ర వ్యవహారాలకు దూరంగా ఉంటారు. ఇప్పటి వరకూ ఆమె స్థానంలో మరో ఇన్ చార్జిని నియమిస్తున్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ ఎటువంటి ప్రకటనా చేయలేదు. అంటు ఆమె అందుబాటులో ఉండని ఈ పది నెలల కాలం.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలలో సీఎం రేవంత్ రెడ్డి సంపూర్ణ ఆధిపత్యం ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి. [Revanth Reddy Tightens grip On Party And Government, Telangana Congress, Konda Surekha, Komatireddy Rajagopal Reddy, Cabinet Expansion, Telangana Politics, Telugu One]
http://www.teluguone.com/news/content/revanth-reddy-tightens-grip-on-party-and-government-25-230870.html





