2600 కోట్ల బియ్యం స్కాం.. సీబీఐ విచారణకు రేవంత్ డిమాండ్.. గవర్నర్‌కు రిపోర్ట్
Publish Date:Apr 13, 2022
Advertisement
బియ్యం పేరుతో 2600 కోట్ల గోల్‌మాల్ జరిగిందని.. అవకతవకలపై కేంద్రం సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నిలదీశారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే బియ్యం స్కాం జరిగిందని ఆరోపించారు. "గతేడాది కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు వరికి సంబంధించి నిధులను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి వడ్లను మిల్లర్లకు ఇస్తే.. మిల్లర్లు వడ్లను బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి సరఫరా చేయాల్సి ఉంది. కానీ మిల్లర్లు 8,34,000 మెట్రిక్ టన్నులు బియ్యం సరఫరా చేయలేదని తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఆ బియ్యం విలువ రూ.2,600 కోట్లు ఉంటుంది. ఇంత మొత్తంలో అవకతవకలు జరిగితే కేంద్రం సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదు? బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వకపోతే మిల్లర్ల దగ్గర వడ్లు ఉండాలి. ఎఫ్‌సీఐ అధికారులు మిల్లర్ల దగ్గర తనిఖీలు చేస్తే.. వారి వద్ద వడ్లు లేవు. అంటే మిల్లర్లు, దళారులు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి రూ.2,600 కోట్ల బియ్యాన్ని మాయం చేశారు. దీనిపై స్పందించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లను, రైతులను అడ్డం పెట్టుకొని.. రాజకీయ ప్రయోజనాల కోసం ధర్నాలు చేస్తున్నారు" అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రైతు సమస్యలు, టీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడుతున్న అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున గవర్నర్ తమిళిసైకి నివేదిక అందించారు. గవర్నర్‌ను కలిసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. "వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, కోటి ఎకరాలకు నీరు ఇస్తున్నామని చెప్పిన సీఎం కేసీఆర్ వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టారు. రైతులు పండించిన పంట కొనకపోవడం వల్ల రైతులకు వేల కోట్ల నష్టం జరిగింది. వందలాది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ధాన్యం కుప్పలపై రైతుల గుండె ఆగిపోతుంటే ప్రభుత్వం కనీసం వారి కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఫల్యం వల్ల చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలి. కొనుగోలు కేంద్రాలు తెరవడంలో ఆలస్యం చేయడంతో దాదాపు 30 శాతం మంది రైతులు పండించిన ధాన్యం దళారులు, మిల్లర్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. క్వింటా రూ.1960 కనీస మద్దతు ధరకు కొనాల్సిన ధాన్యాన్ని.. మిల్లర్లు, దళారులు కేవలం రూ.1300కే కొన్నారు. ఇప్పటివరకూ జరిగిన కొనుగోళ్లలో రైతులకు రూ.2వేల కోట్ల మేర నష్టం జరిగింది". అన్నారు రేవంత్‌రెడ్డి. "ఏ రైతులు తక్కువ ధరకు పంటను అమ్ముకున్నారో వారి వివరాలు మిల్లర్ల దగ్గరున్నాయి. ఆ రైతులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.600 అదనంగా బోనస్ ఇవ్వాలని, ఇప్పించాల్సిందిగా గవర్నర్‌కు నివేదిక ఇచ్చాం. రాష్ట్రంలో రైతులు పండించే ధాన్యంలో చివరి గింజా కొనాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది. కాంగ్రెస్ ఒత్తిడికి లొంగి కేసీఆర్ ధాన్యం కొంటామని చెప్పారు. ఇప్పుడు సర్కారు కొనుగోలు చేస్తానని చెప్పిన ధాన్యాన్ని కనీస మద్దతు ధర రూ.1960కి రైతులకు చెందే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరాం". అని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పారు.
http://www.teluguone.com/news/content/revanth-reddy-team-meets-governor-tamilisai-39-134316.html





