ఎర్రకోట పేలుడు వెనకున్నదెవరో తెలుసా?
Publish Date:Aug 13, 2026
Advertisement
ఢిల్లీ నగరంలో అత్యంత భద్రత కలిగిన ఎర్రకోట ప్రాంతంలో సంభవించిన కారు బాంబు పేలుడు ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరిదన్న దానిపై ఇంత కాలంగా పలు అనుమానాలు వ్యక్త మయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నిటినీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్సీ) పటాపంచలు చేసింది. ఎర్రకోట పేలుడు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అల్ ఖైదా అని తేల్చింది. యూఎన్‌ఎస్సీ విడుదల చేసిన అధికారిక నివేదికలో.. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు వెనుక ఉన్నది అల్‌ఖైదా అనుబంధ వింగ్ అయిన అల్‌ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్‌కాంటినెంట్ (ఏక్యూఐఎస్) అని విస్పష్టంగా పేర్కొంది. గత ఏడాది నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఉన్న రద్దీ మార్గంలో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 11 మంది మరణింగా, పలువురు గాయపడ్డారు. మొదట్లో ఈ ఆత్మాహుతి దాడి వెనుక ఉన్నది పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్ర సంస్థ అని అంతా అనుమానించారు. పేలుడు జరిగిన కారు నడిపిన వ్యక్తిని ఉమర్-ఎ-నబీగా విచారణ అధికారులు గుర్తించారు. అతడే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. అయితే.. ఉగ్ర కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచే యూఎన్‌ఎస్సీ ఈ ఏడాది అగస్టు 10 (సోమవారం) విడుదల చేసిన నివేదిక ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు సూత్రధారి జైష్-ఎ-మొహమ్మద్ కాదనీ, అల్‌ఖైదా ప్రాంతీయ విభాగమైన ఏక్యూఐఎస్ అనీ తేల్చింది. 2014వ సంవత్సరంలో రూపుదిద్దుకున్న ఏక్యూఐఎస్ సంస్థ.. ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఆప్ఘనిస్థాన్ వంటి దక్షిణ ఆసియా దేశాల్లో అల్‌ఖైదా నెట్‌వర్క్, ఉగ్ర భావజాలాన్ని విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. గతంలో పెద్ద పెద్ద ముఠాలుగా దాడులు జరిపే పద్ధతికి భిన్నంగా, ఈ సంస్థ ప్రస్తుతం చిన్న చిన్న రహస్య సెల్స్ రూపంలో విడిపోయి, నిశ్శబ్దంగా బలోపేతం అవుతోందని ఆ నివేదికలో యూఎన్‌ఎస్సీ పేర్కొంది. ఈ నివేదిక ఇంకా దక్షిణాసియా ప్రాంతంలో అల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద అనుబంధ సంస్థల దాడుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతోందని హెచ్చరించింది. ఈ ఉగ్ర సంస్థలు రసాయన, జీవాయుధాలను సేకరించి.. వాటితో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయనీ, కుట్రలు పన్నుతున్నాయనీ వెల్లడించింది. ఎర్రకోట పేలుడులో 11 మంది ప్రాణాలను బలిగొన్న ఘటన వెనుక ఏక్యూఐఎస్ ఉందన్న ఐరాస భద్రతా మండలి నివేదిక ఇండియా భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను ఎత్తి చూపింది. Red Fort blast, AQIS Al Qaeda, UNSC report, Delhi blast, UN security council terror report
http://www.teluguone.com/news/content/red-fort-blast-36-228824.html





