తిరుగుబాటలో ఎమ్మెల్యేలు.. బీజేపీకి ఎదురీత తప్పదా?
Publish Date:Jan 11, 2022
Advertisement
ఇంతవరకు వచ్చిన ఎన్నికల సర్వేలు అన్నీ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎడ్జ్ ఉందని, మళ్ళీ మరో మారు బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పాయి. అయితే, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా క్రైస్తవ ఎమ్మెల్యేలు ఒకరొకరుగా పార్టీని వదిలి పోతున్న నేపధ్యంలో, క్రైస్తవ ఓటు ప్రభావం చూపే నియోజకే వర్గాల్లో బీజేపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంని, దీంతో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. కాగా, ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలి వెళ్ళగా, ఇప్పుడు ఏకంగా, ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కలాంగుటే ఎమ్మెల్యే, మంత్రి మైఖేల్ లోబో ఎమ్మెల్యే పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన నేదో రేపో కాంగ్రెస్ లేదా ఆప్’లో చేరే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు. నిజానికి, మైఖేల్ లోబో చాలా కాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. బిజెపి వర్గాల సమాచారం ప్రకారం, సియోలిమ్ నియోజకవర్గం నుండి తన భార్య దలీలాకు పార్టీ టికెట్ ఆశించారు. అయితే, బిజెపి అందుకు అంగీకరించలేదు. దీంతో ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ కూడా లోబో భార్యకు టికెట్ ఇస్తామన్న హామీ ఇవ్వక పోవడంతో ఆయన ఇటు ఆప్’తో అటు తృణమూల్ నాయకులతో చర్చలు జరుపు తున్నారు. ఇంచు మించుగా ఐదారు నియోజక వర్గాల్లో ప్రభావం చూపే మైఖేల్ లోబోను తమవైపుకు తిప్పుకునేందుకు ఇటు ఆప్, అటు తృణమూల్ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో టీఎంసీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మైఖేల్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవంక లోబోను తనవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ విజయవంతమైతే, బీజేపీకి బలమైన ప్రాబల్యం ఉన్న ఉత్తర గోవాలో కమల దళానికి ఎదురుదెబ్బ తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ వదిలి వెళితేనే ఫలితాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉంటుంది, అలాంటిది ఇలా వరస పెట్టి క్రైస్తవ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా బాట పడితే, బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదని అంటునారు. లోబోకు ముందు గత నెలలో కార్టోలిమ్ ఎమ్మెల్యే అలీనా సల్దాన్హా బీజేపీని వీడారు. అలీనా ఆప్‌లో చేరగా, వాస్కోకు చెందిన మరో క్రిస్టియన్ ఎమ్మెల్యే కార్లోస్ అల్మేడా బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.ఇదిలా ఉండగా, మాయెమ్ నియోజకవర్గానికి చెందిన మరో బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ జాంట్యే నిన్న (సోమవారం) రాజీనామా చేశారు. జాంటీ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీలో చేరే అవకాశం ఉంది. వెలిమ్ ఎమ్మెల్యే మరియు మంత్రి ఫిలిప్ నెరి రోడ్రిగ్జ్ మరియు నువెమ్ ఎమ్మెల్యే విల్ఫ్రే డిసా, అలియాస్ బాబాషన్ కూడా త్వరలో బిజెపిని విడిచిపెడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఫిరాయింపులపై ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాత్రం ధీమాగా ఉన్నారు. గోవాలో బీజేపీకి ఎదురులేదని ఆయన పేర్కొన్నారు. మాతృ భూమికి అంకితభావంతో సేవలందిస్తున్న బీజేపీని, అడ్డుకోవడం కాంగ్రెస్, ఆప్ , తృణమూల్ కు సాధ్యం కాదని సావంత్ ధీమా వ్యక్తపరుస్తున్నారు. ఏదిఏమైనా ఈ సారి బిజెపి నుండి చోటుచేసుకుంటున్న ఫిరాయింపులు ముఖ్యంగా క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో కీలక నేతలు పార్టీని వీడి వెళ్ళడం బిజెపికి దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/rebels-problem-in-goa-bjp-39-130060.html





