జగన్ ఘోర పరాజయ పరాభవానికి కారణాలివే?
Publish Date:Jun 8, 2024
Advertisement
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఘోర పరాజయం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. ఆయితే తాజా ఎన్నికలలో జగన్ పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, ఆ పార్టీకి వచ్చిన సీట్లు మాత్రం మహామహా రాజకీయ పండితులే అచ్చెరువొందేటట్లు చేశాయి. ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొందన్న విషయం ఎన్నికలకు చాలా ముందు నుంచే ప్రస్ఫుటంగా కనిపించింది. స్పష్టంగా వినిపించింది. ఇక రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం ఎవరిదన్నది ప్రీపోల్ సర్వేలు, ఆ తరువాత ఎగ్జిట్ పోల్స్ కూడా వైసీపీ పరాజయాన్ని ముందుగానే ఊహించాయి. అంతెందుకు వైసీపీకి అవును వైసీపీకి మాత్రమే ఎన్నికల వ్యూహాలను అందించే ఐ ప్యాక్ కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పేసిందని ఎన్నికలకు ముందే వైసీపీ వర్గాలలో గట్టిగా వినిపించింది. అసలు ఈ స్థాయిలో వైసీపీ పాలనపై వ్యతిరేకత పెరగడానికి కారణమేంటి? సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంత ఘోరంగా ఎందుకు విఫలమయ్యారు? ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ సామర్థ్యం, పని తీరు చెప్పడానికి ఎవరైనా సరే ప్రమాణికంగా తీసుకునే ప్రధాన అంశాలలో జగన్ దారుణంగా విఫలమయ్యారు. ఆ రాష్ట్ర ఆదాయం (జీడీపీ) పెరుగుదల. తలసరి ఆదాయం, పన్నుల రూపంలో వచ్చే ఆదాయం మానవాభివృద్ధి (విద్య, వైద్యం, ఆరోగ్యం, పౌష్టికాహారం, సంక్షేమం వంటివి మానవాభివృద్ధి కిందకి వస్తాయి.) ఇక, పారిశ్రామిక రంగాల్లో, సర్వీస్ రంగాల్లో ఎదుగుదల ఐదో అంశంగా చెప్పుకోవచ్చు. ఈ అంశంలో ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పన, పారిశ్రామిక వాడల ఏర్పాటు, రోడ్లు ఇతర మౌలిక సౌకర్యాలు వస్తాయి. అలాగే ప్రజాస్వామ్య స్పూర్తి మరో కీలక అంశంగా పేర్కొనాలి. అంటే ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటం, అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, రాజ్యాంగ సంస్థల బలోపేతం లాంటివి అన్నమాట. జగన్ ఈ అంశాలన్నిటిలోనూ ఘోరంగా విఫలమయ్యారు. జగన్ హయంలో రాష్ట్ర జీడీపీ ఘోరంగా దిగజారిపోయింది. తలసరి ఆదాయం ఏడాదికి ఏడాది దిగువకు పడిపోగా.. ప్రజలను పీడించి పన్నులు వసూలు చేయడంతో కొనుగోలు శక్తి తగ్గిపోయి ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇక మానవాభివృద్ధిలో తమ సర్కార్ గొప్పగా చేస్తుందని వైసీపీ పెద్దలు ఘనంగా చెప్పుకున్నా వాస్తవం మాత్రం పూర్తి రివర్స్ గా ఉంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, పౌష్టికాహారం, సంక్షేమం వంటివి వాటిని పూర్తిగా విస్మరించి కేవలం బటన్ నొక్కి డబ్బులు పంచి అదే మానవాభివృద్ధిగా జగన్ భావించారు. విద్య, ఆరోగ్యం విషయంలో ప్రకటనలు తప్ప ఆచరణ కనిపించడం లేదు. ఇక, పారిశ్రామిక రంగం, సర్వీస్ రంగాల్లో అభివృద్ధి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పన, పారిశ్రామిక వాడల ఏర్పాటు, రోడ్లు రవాణా అంశాలలో జగన్ సర్కార్ సాధించింది శూన్యం. జగన్ హయాంలో ప్రజాస్వామ్య స్పూర్తి ఇసుమంతైనా కనిపించలేదు. ప్రభుత్వం ప్రజలతో సంబంధాలను పూర్తిగా తెంచేసుకుకుంది. అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, రాజ్యాంగ ప్రకారం పాలనా వంటి వాటికి అర్ధమే తెలియదన్నట్లుగా జగన్ పాలన సాగింది. ఏపీలో అసలు రాజ్యాంగం అమలు కావడం లేదంటూ కోర్టులే పలు సందర్భాలలో చీవాట్లు పెట్టాయి. గెలిచే వరకూ ప్రజల మధ్యలో ఉన్న జగన్.. గెలిచాక ప్రజలకి మొహం చూపించకుండా పరదాలు కప్పుకు తిరుగుతూ పాలన సాగించారంటేనే జగన్ హయాంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్న మాటకు అర్ధమే లేకుండా పోయిందని ఎవరికైనా ఇట్టే అర్ధమౌతుంది. పారిశ్రామిక రంగంలో రాష్ట్రంలో అభివృద్ధి రివర్స్ గేర్ లో సాగింది. కొత్త పరిశ్రమలు రావడం సంగతి అటుంచి ఉన్న పరిశ్రమలే రాష్ట్రం వదిలి పారిపోయాయి. పెట్టుబడులు శూన్యం, అభివృద్ధి శూన్యం, ఉద్యోగ, ఉపాధి కల్పన శూన్యం, విద్య వైద్యం ఆరోగ్యం సంక్షేమం శూన్యం అన్నట్లుగా రాష్ట్రం పరిస్థితి, రాష్ట్రంలో పాలన పరిస్థితి తయారైంది. ఇదేమిటని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, దాడులు. ప్రతిపక్ష నేతలు నుండి మొదలుకొని సామాన్య ప్రజల వరకు అందరినీ జగన్ సర్కార్ వేధించింది. వేపుకు తింది. జగన్ గొప్పగా చెప్పుకున్న సంక్షేమ పథకాలు కూడా పన్నుల ద్వారా ప్రజల నుండి వేలల్లో వసూలు చేసి అందులోంచి వందల్లో తిరిగి ఇవ్వడంగానే సాగింది. కళ్ల ముందు కనిపిస్తున్న ఈ వాస్తవాలే జగన్ కు గతంలో ఎవరికీ, ఏ ప్రభుత్వానికీ దక్కనంత ఘోర పరాజయాన్ని అందించింది. అయితే ఇది గుర్తించడానికి సిద్ధంగా లేని జగన్ ఇప్పటికీ నేను ఇచ్చిన డబ్బులు తీసుకున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లేమయ్యాయి? ఏదో కుట్ర జరిగింది అంటూ ఆరోపణలు చేయడం చూస్తుంటే.. జగన్ ప్రజాభిమానాన్ని దక్కించుకుని పార్టీని బతికించుకునే దిశగా అస్సలు ఆలోచనే చేయడం లేదని అర్ధమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/reasons-for-jagan-defeat-39-178146.html





