విజయమ్మ బంధువనే బాలినేనికి భారతి చెక్ పెట్టారా? అవినీతీ కారణమా?
Publish Date:Apr 11, 2022
Advertisement
బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ వైసీపీలో కాక రేపుతోంది. అత్యంత సీనియర్ ఎమ్మెల్యే, మంత్రి.. పార్టీలో కీలక నేతగా ఉన్న బాలినేనికి మరోసారి మంత్రి పదవి రాకపోవడం తీవ్ర కలకలంగా మారింది. ఆదిమూలపు సురేశ్‌ను కేబినెట్‌లో కంటిన్యూ చేస్తూ.. తనను మాత్రం పక్కన పెట్టేయడంపై బాలినేని బాగా హర్ట్ అయ్యారు. అసహనంతో, అవమానంతో రగిలిపోతున్నారు. ఆయన అనుచరులు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి బాలినేని రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ, బాలినేనికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు జగన్‌రెడ్డి? సురేశ్‌కు ఇచ్చినంత ప్రాధాన్యత కూడా ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. బాలినేనిని బలి చేయడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందని అంటున్నారు. వైఎస్ విజయమ్మ మరిది వైవీ సుబ్బారెడ్డికి బావమరిది బాలినేని. ఆ విధంగా తల్లి తరఫున జగన్‌కు సమీప బంధువు. మరి, అంత క్లోజ్ రిలేషన్‌ను కేబినెట్ నుంచి ఎందుకు తప్పించినట్టు? 10 మంది తాజా మాజీలకు మరో ఛాన్స్ ఇచ్చిన జగన్‌రెడ్డి.. బాలినేనికి ఎందుకు అవకాశం ఇవ్వలేదంటూ.. అందుకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. అవును, విజయమ్మతో బంధుత్వం, విజయమ్మ-షర్మిలతో సాన్నిహిత్యమే బాలినేని భవితవ్యానికి చెక్ పెట్టిందని అంటున్నారు. ఆ మేరకు వైఎస్ భారతి పావులు కదిపారని తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వం, పార్టీ, సొంత మీడియా వ్యవహారాలను జగన్ సతీమణి భారతి యాక్టివ్‌గా పర్యవేక్షిస్తున్నారు. కేబినెట్ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోకపోయినా.. బాలినేని మేటర్‌లో మాత్రం భారతి మాటే చెల్లుబాటు అయిందని అంటున్నారు. జగనన్నను కాదని.. తెలంగాణలో షర్మిల జెండా ఎగరేయడం, కూతురుకు తోడుగా తల్లి విజయమ్మ జగన్‌కు దూరం అవడం, జగన్‌కు వ్యతిరేకంగా షర్మిల భర్త అనిల్ ఏపీలో కుల-మత సంఘాల మీటింగులు పెడుతూ స్టేట్‌మెంట్లు ఇస్తుండటం.. ఇంట్లో ఆస్తుల పంపకాలపై గొడవలు.. ఇలాంటి విషయాలపై భారతి తీవ్ర ఆగ్రహంతో, అసహనంతో ఉన్నారని తెలుస్తోంది. తమను ఇంతగా ఇబ్బంది పెడుతున్న విజయమ్మ-షర్మిలతో ఇప్పటికీ దగ్గరి సంబంధాలు నెరుపుతున్న బాలినేనిని పక్కన పెట్టాల్సిందేనని జగన్‌తో భారతి గట్టిగా చెప్పారని సమాచారం. జగన్ సైతం ఆమె మాటతో ఏకీభవించి బాలినేనిని సైడ్ చేశారని.. ఆయన స్థాయిని తగ్గించాలనే, కావాలనే సురేశ్‌కు మరోఛాన్స్ ఇచ్చారని చెబుతున్నారు. మరోవైపు, బాలినేనిపై తీవ్ర అవినీతి ఆరోపణలు కూడా ఆయనకు మంత్రిమండలిలో చోటు దక్కకపోవడానికి కారణం అంటున్నారు. బాలినేని వెయ్యి కోట్ల అవినీతి చేశారంటూ ఇప్పటికే టీడీపీ ఆరోపించింది. అప్పట్లో ఓ ప్రైవేట్ ఫ్లైట్‌లో రష్యాలో పార్టీ చేసుకొచ్చి తీవ్ర విమర్శల పాలయ్యారు. ఇక, జిల్లాలో బాలినేని అనుచరులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. విద్యుత్తు, రెవెన్యూ శాఖల్లో అధికారులపై తమ పనులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని.. నచ్చని అధికారుల బదిలీలు, నచ్చిన వారికి అందలం ఎక్కించడం లాంటి అంశాలపై అధిష్టానానికి చాలా ఫిర్యాదులు అందాయని అంటున్నారు. బాలినేని పేరు చెప్పుకొని కొందరు బంధువులు, మద్దతుదారులు అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మరోసారి బాలినేనికి మంత్రి పదవి ఇస్తే వారి ఆగడాలు శ్రుతిమించి పార్టీకి చెడ్డ పేరు తెస్తాయన్న ఆలోచనలతోనే ఆయనకు కేబినెట్‌లో చోటు ఇవ్వలేదని కూడా అంటున్నారు. కారణం ఏదైనా.. బాలినేనికి మంత్రి పదవి అయితే రాలేదు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై సన్నిహితులతో చర్చిస్తున్నారు. త్వరలోనే సంచలన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/reasons-behind-balineni-episode-39-134210.html





