ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ లో ఆర్సీబీ అలవోక విజయం
Publish Date:Mar 28, 2026
Advertisement
ఐపీఎల్ సీజన్ 19 ఘనంగా ప్రారంభమైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య శనివారం తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ అద్బుత విజయాన్ని అందుకుంది. గత సీజన్ విజేత, డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ 202 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి సన్ రైజర్స్ ను మట్టి కరిపించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు బ్యాటర్లు కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించేశారు. కింగ్ హోహ్లీ అజేయ అర్ధ సెంచరీతో చెలరేగి జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 పరుగులతో రాణించాడు. ఇచ చివరిలో అనికేత్ వర్మ 43 పరుగుల మెరుపు బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించడంతో సన్‌రైజర్స్ ఈ స్కోరు సాధించగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో అరంగేట్రం చేసిన జాకబ్ డఫ్ఫీ 3 వికెట్లతో సన్‌రైజర్స్‌ను దెబ్బతీశాడు. ఇక 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆరంభంలోనే ఫిలిప్ సాల్ట్ వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పాడిక్కల్‌తో కలిసి విరాట్ కోహ్లీ విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 45 బంతుల్లోనే 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పాడిక్కల్ 26 బంతుల్లో 61 పరుగులు చేసి ఔట్ కాగా, కోహ్లీ తన క్లాసిక్ ప్లే తో అలరించాడుజ 34 బంతుల్లో 5 ఫోర్లు. 5 సిక్సర్లతో అజేయంగా 69 పరుగులు చేశాడు. పడిక్కల్ ఔటైన తరువాత క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ పటీదార్ కూడా 12 బంతుల్లో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. 202 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఇంకా 26 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగడం తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నాడు. గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ, ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది. సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం ఆ జట్టు అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. వరుసగా రెండో ఏడాది కూడా టైటిల్ సాధించి చరిత్ర సృష్టించాలని బెంగళూరు భావిస్తోంది. అదలా ఉంటే తొలి మ్యాచ్ లో ఓటమితో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ విభాగం బలహీనతలు ప్రస్ఫుటంగా బయటపడ్డాయి. ఆర్సీబీ తన తదుపరి మ్యాచ్ వచ్చే నెల 5న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. సన్‌రైజర్స్ తమ తర్వాతి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఢీకొట్టనుంది.
http://www.teluguone.com/news/content/rcb-easy-victory-on-srh-36-216339.html





