సీమ సింహం బాలయ్య
Publish Date:Sep 17, 2022
Advertisement
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే రాయలసీమ జల్లాల ఎన్నికల ప్రచార బాధ్యత హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. బాలయ్య(బాలకృష్ణ) ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అదీ కాక రాయలసీమ బ్యాక్ గ్రౌండ్‌లో ఆయన హీరోగా తెరకెక్కిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లేనన్న విషయం విదితమే. అలాగే సీమ జిల్లాల్లో బాలయ్యకు భారీగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అందుకే రాయలసీమలో టీడీపీకి బాలయ్య ప్రచారం పార్టీ విజయాన్ని నల్లేరుమీద బండి నడక చేస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే పార్టీ శ్రేణులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రచారంలో జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిన తీరు, అన్ని వర్గాల ప్రజలూ ఎలా ఇబ్బందులు పడుతున్నారు. అ పన్నుల రూపంలో జగన్ సర్కార్ ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్న విధానం, ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. జగన్ పాలనలో ప్రజలు పొందింది ఎంత.. పొగొట్టుకొంది ఎంత అనే అంశంతోపాటు జగన్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించేందుకు బాలయ్య సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే.. జగన్ పాలనలోని లోపాలను ఎత్తి చూపుతూ.. బాదుడే బాదుడు కార్యక్రమంతోపాటు మినీ మహానాడులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇంకోవైపు టీడీపీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అన్న క్యాంటిన్లు సైతం నిర్వహిస్తున్నది. అలాగే హిందూపురం, మంగళగిరిలో ఇప్పటికే ఆరోగ్య రథాలు సైతం ప్రారంభమైనాయి. ఇలా ప్రజలకు ఉపయుక్తంగా ఉండే కార్యక్రమాలతో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రజలకు చేరువైంది. జగన్ దుర్మార్గ పాలన గురించి మరింత విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా వైసీపీకి ప్రజలను దూరం చేయాలన్న వ్యూహంతా చంద్రబాబు పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే సీమ జిల్లాల ప్రచార బాధ్యతలను బాలయ్యకు అప్పగించాలని నిర్ణయించారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలంతా విభేదాలను విడనాడి ఏకతాటిపైకి వచ్చి ప్రజలతో మమేకమైతే తెలుగుదేశం విజయం ఖాయమనీ, క్యాడర్, లీడర్ కలిసి సాగితే వచ్చే ఎన్నికలలో సైకిల్ స్పీడ్ కి తిరుగుండదని తెలుగుదేశం అధినేత పార్టీ నేతలకు ఉద్భోధిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. సైకిల్ స్పీడ్ చూస్తుంటే 2024 ఎన్నికలలో ఘన విజయం ఖాయమని పార్టీ క్యాడర్ ఉత్సాహంతో చెబుతోంది.
http://www.teluguone.com/news/content/rayalaseema-tdp-election-campaign-incharge-nandamuri-bala-krishna-25-143954.html





