10 ఏళ్ల పరిచయం: చివరికి రూ.16 కోట్లతో జంప్.!
Publish Date:Sep 27, 2026
Advertisement
పదేళ్లుగా పక్కింటివారిలా పరిచయం.. మెల్లిగా చీటీలతో నమ్మకం సంపాదించారు.. ఆ నమ్మకంతోనే ఒక్కొక్కరి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారు. తీరా డబ్బులు చేతికి అందిన తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి కనిపించకుండా పోయారు. కేపీహెచ్‌బీ పరిసర ప్రాంతంలో ఓ కుటుంబంపై నమోదైన మోసం కేసు ఇప్పుడు కలకలం రేపుతోంది. కేపీహెచ్‌పీ పరిసర ప్రాంతంలో నివాసముంటున్న రమణారెడ్డి, ఆయన భార్య సీత, కుమార్తె హరీషా రెడ్డి స్థానికులతో కలిసిమెలిసి ఉండేవారు. మొదట చీటీల నిర్వహణ ప్రారంభించి.. దానిని నమ్మకంగా కొనసాగిస్తూ అందరికీ దగ్గరయ్యారు. దీంతో వారిపై స్థానికులకు పూర్తిగా నమ్మకం ఏర్పడింది. అదే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని చీటీలతో పాటు డిపాజిట్లు చేస్తే మంచి వడ్డీ ఇస్తామంటూ పలువురిని నమ్మించారు. పదేళ్లుగా అదే ప్రాంతంలో నివాసముండటంతో తమకు తెలిసిన కుటుంబమేనని చాలామంది పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు. ఇలా చీటీలు, డిపాజిట్ల పేరుతో డబ్బులు తీసుకుంటూ వెళ్లిన ముగ్గురు.. చివరకు భారీ మొత్తాన్ని వసూలు చేసిన అనంతరం అక్కడి నుంచి ఉడాయించారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ కావడంతో తాము మోసపోయామని గుర్తించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దాదాపు 44 మంది నుంచి రూ.16 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు రమణారెడ్డి, సీత, హరీషా రెడ్డిపై కేసు నమోదు చేశారు. చీటీలు, డిపాజిట్ల పేరుతో జరిగిన లావాదేవీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. [ Ramana Reddy, Wife Seetha and daughter Harisha Reddy, KPHP, 10-Year Relationship, ₹16 Crore Fraud, ₹16 Crore Scam, Financial Fraud, Cheating Case, Trust Fraud, Money Scam ]
http://www.teluguone.com/news/content/ramana-reddy-24-232691.html




