డిసెంబర్ 31న కొత్త పార్టీ! తమిళనాట రజనీ బర్త్ డే సందడి
Publish Date:Dec 12, 2020
Advertisement
తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై మూడేళ్లుగా నాన్చుతూ వస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. అభిమానులు, తన అనుచరులతో ముమ్మర సంప్రదింపుల తర్వాత ఆయన రాజకీయ అరంగ్రేటం ఖాయమైందని తెలుస్తోంది. డిసెంబర్ 31న పార్టీ స్థాపనపై రజనీకాంత్ ప్రకటన చేస్తారని చెబుతున్నారు. పార్టీ పేరును రిజిస్టర్ చేయడంలో ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద మక్కల్ మన్రం అగ్రనేతలు బిజీబిజీగా గడుపుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి న్యాయవాదుల నుంచి సలహా లు స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరు, పతాకం, చిహ్నంపై రజనీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మూడు పేర్లను సీఈసీ వద్ద నమోదు చేస్తే అందులో ఏదో ఒకదాన్ని అధికారులు ఆమోదిస్తారు. ఈ ప్రక్రియ నెలాఖరుకు పూర్తయితే 31న పార్టీ పేరును రజనీ అధికారికంగా ప్రకటిస్తారని అంచనా. రాజకీయాల్లోకి రావడం ఖాయమని రజనీకాంత్ 2017 డిసెంబర్లో చెప్పారు. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. కాని ప్రకటన చేసిన మూడేళ్ల వరకు పార్టీ ఏర్పాటుపై ముందడుగు పడలేదు. ఇంతలోనే అనారోగ్య కారణాలతో రజనీకాంత్ రాజకీయ పార్టీపై వెనక్కి తగ్గారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అది నిజమేనన్నట్లుగా రజనీకాంత్ సంకేతమిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో రజనీకాంత్ పార్టీ ఉండకపోవచ్చనే ప్రచారం కూడా జరిగింది. కాని గత నెల నుంచి మళ్లీ రాజకీయ పార్టీ దిశగా రజనీకాంత్ అడుగులు వేశారు. పార్టీ స్థాపనపై మక్కల్ మన్రం నిర్వాహకులతో రజనీకాంత్ ఇటీవల చెన్నైలో సమాలోచనలు జరిపారు. ప్రధాన సమన్వయకర్త అర్జున్‌మూర్తి, పర్యవేక్షకులు తమిళరువి మణియన్ సహా ముఖ్య నేతలతో చర్చల తర్వాత పార్టీకి ఓకే చెప్పినట్లు చెబుతున్నారు. ఈనెలాఖరులో పార్టీని ప్రకటించబోతున్న తరుణంలో శనివారం రజనీకాంత్ 71వ జన్మదినోత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలతో అభిమానులు సందడి చేస్తున్నారు. రజనీకాంత్‌కు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని, ఎన్నికల్లో ఘనవిజయం సాధించాలని ప్రార్థిస్తూ మక్కల్ మన్రం నిర్వాహకులు ఎన్నూరులోని శ్రీ అంకాళ పరమేశ్వరీ ఆలయంలో ప్రత్యేక యాగాన్ని నిర్వహించారు. వెస్ట్‌మాంబళంలోని శంకరమఠంలో గోపూజ జరిపారు. అశోక్‌నగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకం, మహిళా విభాగం అధ్వర్యంలో రంగరాజపురంలో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/rajinikanth-to-launch-political-party-on-december-31-39-107641.html





