సింహం సింగిల్‌గానే వస్తుంది... జులైలో పొలిటికల్ ఫొటో షూట్..?
Publish Date:Jun 2, 2017
Advertisement
రజనీ పొలిటికల్ ఎంట్రీ ఊహాగానాలు తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే నేతలు రజనీ వైపు చూస్తున్నారన్న వార్త... ఆయా పార్టీల్లో కాక పుట్టిస్తోంది. అయితే రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందా..? ఉంటే..ఏ పార్టీలో చేరతారు.. లేదా సొంత పార్టీ పెడతారా..? సొంతంగా వస్తే... ముహూర్తం ఎప్పుడు..? అనే ప్రశ్నలకు సమాధానం దొరికింది. రజనీ పొలిటికల్ ఎంట్రీ గురించి ఆయన అన్నయ్య సత్యనారాయణ గైక్వాడ్ సంచలన ప్రకటన చేశారు. అవినీతిని అంతం చేయడానికి తన సోదరుడు రాజకీయాల్లో వస్తున్నట్టు చెప్పేశారు. పార్టీ పేరు, జెండా, ఎజెండా గురించి చర్చలు జరుగుతున్నాయని జులైలో ప్రకటన ఉంటుందని సత్యనారాయణ గైక్వాడ్ స్పష్టం చేశారు. అలాగే కొద్దిరోజుల కిందట గాంధీ ప్రజాసంఘం అధ్యక్షుడు దమిళరువి మణియన్ ...రజనీకాంత్‌ను కలిసిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావడం తథ్యమని తేల్చి చెప్పారు. వీరి మాటలు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో మరింత వేడిని రాజేశాయి. అంతేకాదు రజనీ పార్టీలో చేరతామంటూ ఐదుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాయబారం పంపడం హాట్ టాపిక్‌గా మారింది తమిళనాడులో కొన్ని దశాబ్దాలుగా అన్నాడీఎంకే, డీఎంకే గుత్తాధిపత్యం మాత్రమే సాగుతోంది. ఈ రెండు పార్టీల్లో ఏదో పార్టీకి మాత్రమే అధికారం దక్కుతోంది. అయితే అమ్మలేని అన్నాడీఎంకేను తీసేస్తే....ప్రస్తుతం తమిళనాట ఏకైక బలమైన పార్టీ డీఎంకే మాత్రమే. కానీ ఆ పార్టీ అధినేత కరుణానిధి వృద్ధాప్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కరుణానిధి కొడుకు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఇంకా తనను తానుగా నిరూపించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం తమిళ ప్రజలు తమను పరిపాలించే బలమైన నేత ఎవరా అని వేయి కనులతో ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితిలో రజనీకాంత్ కు మాత్రమే ఆ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉందని రాజకీయ శ్లేషకులు చెబుతున్నారు. అన్నాదురై.. కరుణానిధి... ఎంజీఆర్, జయ తరహాలో తమిళనాడు రాజకీయాలను శాసించగల అవకాశం అభిమాన ధనం కబాలీకి ఉందని విశ్లేషకుల అంచనా. రజనీ పొలిటికల్ ఎంట్రీకి సరైన సమయమిదేనని.... తలైవా రాజకీయ ప్రవేశంతో తమిళనాడులోని ప్రధాన పార్టీల జాతకాలు తారుమారవడం ఖాయమని లెక్కలు కడుతున్నారు. మరి సింహం సింగిల్‌గా వస్తుందా? లేక మరో సింహంతో కలిసి వస్తుందో చూడాలి.
http://www.teluguone.com/news/content/rajinikanth-45-75286.html





