పార్టీ పెట్టి ఉంటే ఖచ్చితంగా గెలిచేవాడిని : రజనీకాంత్
Publish Date:May 17, 2026
Advertisement
తాను పార్టీ పెట్టి ఉంటే ఖచ్చితంగా గెలిచేవాడినిని సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల విషయంలో తనపై వస్తున్న అనేక ప్రచారాలపై ఆయన స్పందించారు. చెన్నైలో ఆదివారం (17-5-26) రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని పేర్కొన్నారు. అలాగే నటుడు విజయ్ సీఎం కావడం తనకు సంతోషమేనని వ్యాఖ్యానించారు. కమల్ హసన్ సీఎం అయితే అసూయ పడేవాడినని చమత్కరించారు. తనకు ఎవరిపైనా ద్వేషం లేదని స్పష్టం చేశారు. విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవాలని తాను ఎప్పుడూ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. తాను పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడినని, ఇకపై రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ను ఇటీవల తాను కలిసిన విషయంపై కూడా రజనీకాంత్ స్పందించారు. ఆ భేటీలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. స్టాలిన్ తనకు మంచి మిత్రుడని, స్నేహపూర్వకంగానే కలిశానని స్పష్టం చేశారు. ఈ సమావేశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని సూచించారు. విజయ్ తనకు సమవుజ్జీ అనుకోవడం లేదని తెలిపారు. అన్ని పార్టీల్లోనూ తనకు అభిమానులుంటారని పేర్కొన్నారు. రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా విజయ్ రాజకీయ ప్రవేశం, తమిళనాడు భవిష్యత్తు ఎన్నికల నేపథ్యంలో రజనీ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని, పార్టీ స్థాపిస్తారని ప్రచారం జరిగినప్పటికీ చివరికి ఆయన అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి రాజకీయాల్లోకి రానని స్పష్టం చేయడంతో ఆయన అభిమానుల్లో చర్చ మొదలైంది.
http://www.teluguone.com/news/content/rajinikanth-36-220069.html





