రాయదుర్గం భూమి రికార్డు ధర...ఎకరాకు రూ.237 కోట్లు
Publish Date:May 28, 2026
Advertisement
తెలంగాణ గ్లోబల్ ఇండస్ట్రియల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన రాయదుర్గ్ ఇ-వేలం తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త చరిత్ర సృష్టించింది. హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతున్న రాయదుర్గ్ గ్రోత్ కారిడార్‌లోని ప్రైమ్ మల్టీ-యూజ్ భూమికి ఎకరాకు సుమారు రూ.237 కోట్ల రికార్డు ధర లభించింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరల్లో ఒకటిగా నిలిచింది. హైదరాబాద్ ఐటీ కారిడార్ కేంద్రంగా ఎదుగుతున్న రాయదుర్గ్ ప్రాంతంలో ఉన్న 6.29 ఎకరాల విస్తీర్ణం గల ప్లాట్ నెం. 1A & 1/F కోసం ఈ భారీ బిడ్డింగ్ జరిగింది. రిజర్వ్ ధర ఎకరాకు రూ.139 కోట్లు కాగా, వేలంలో వచ్చిన తుది ధర దానికంటే సుమారు 70.5 శాతం అధికంగా నమోదైంది. మొత్తం లావాదేవీ విలువ దాదాపు రూ.1,490.73 కోట్లకు చేరుకుంది.ఈ వేలంలో దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లు పోటీపడటం విశేషం. తీవ్ర పోటీ మధ్య నిర్వహించిన డిజిటల్ బిడ్డింగ్ ప్రక్రియలో చివరకు ఈ రికార్డు స్థాయి ధర నమోదైంది. ఈ ఇ-వేలాన్ని MSTC Limited ప్లాట్‌ఫారమ్ ద్వారా నిర్వహించగా, అంతర్జా తీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ JLL ప్రత్యేక లావాదేవీ సలహాదారుగా వ్యవహరించింది. ఈ ఫలితం TGIIC 2025లో నమోదు చేసిన మునుపటి బెంచ్‌మార్క్ అయిన ఎకరాకు రూ.177 కోట్ల రికార్డును దాటింది. తాజా వేలంతో దాదాపు 34 శాతం పెరుగుదల నమోదై, హైదరాబాద్‌లో భూమి విలువలు కొత్త స్థాయికి చేరుకున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఈ సందర్భంగా TGIIC వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ K. శశాంక మాట్లాడుతూ రాయదుర్గ్ ఇ-వేలానికి వచ్చిన స్పందన హైదరాబాద్ మరియు తెలంగాణపై పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో పారదర్శక పాలన, పరిశ్రమలకు అనుకూల విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన వల్లే ఈ స్థాయి పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రాయదుర్గ్ వేలం విజయంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించనుందని, భవిష్యత్తులో మరిన్ని భారీ పెట్టుబడులకు ఇది దారితీయొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/raidurg-land-record-price-36-221178.html





