కొండా సురేఖపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్.. కేబినెట్ నుంచి ఉద్వాసనేనా?
Publish Date:Oct 5, 2024
Advertisement
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ గా ఉంది. ఆమెపై చర్యలకు సిద్ధమౌతోంది. నటి సమంతపై ఆమె చేసిన వ్యాఖ్యల వేడి హస్తినను తాకింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమంతపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొండా సురేఖను ఆదేశించారు. రాజకీయ విమర్శలలో మహిళలను ఎలా లాగుతారని రాహుల్ గాంధీ కొండా సురేఖను నిలదీసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సమంతపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీ కొండా సురేఖను ఆదేశించారు. ఆమె కూడా క్షణం ఆలస్యం చేయకుండా తన వివరణను రాహుల్ కు పంపారు. ఆమె సుదీర్ఘ వివరణపై ఇంకా రాహుల్ నుంచి ఎటువంటి స్పందనా వెలువడ లేదు. అయితే సమంత, నాగ చైతన్య విడాకుల విషయంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల అనంతరం అన్ని వైపులనుంచీ ఆమెపై విమర్శల దాడి జరిగింది. ఇంత జరిగినా జరుగుతున్నా.. కొండా సురేఖకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి సహా ఆయన కేబినెట్ సహచరులెవరూ పెద్దగా స్పందించలేదు. మంత్రిగా ఉన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఆమె వ్యక్తిగత హోదాలో చేశారంటూ కాంగ్రెస్ సర్కార్ తప్పించుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవు. తన వ్యాఖ్యలకు కొండా సురేఖ మాత్రమే కాకుండా క్యాబినెట్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం సద్దుమణగాలంటే, కొండా సురేఖ వ్యాఖ్యల ప్రభావం కాంగ్రెస్ సర్కార్ పై పడకుండా ఉండాలంటే ఆమెపై చర్యలు తీసుకోవడమే మార్గమని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. టీపీసీసీ చీఫ్ రంగంలోకి దిగి వివాదానికి ముగింపు పలకడానికి చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించినట్లు కనిపించదు. కొండా సురేఖ ఒక అడుగు తగ్గి సమంతకు క్షమాపణలు చెప్పడమే కాకుండా, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినా ఆమెపై వెల్లువెత్తుతున్న విమర్శల హోరు ఇసుమంతైనా తగ్గలేదు. టాలీవుడ్ మొత్తం కొండా సురేఖ వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించింది. ఇక విషయాన్ని హైకమాండ్ కూడా సీరియస్ గా తీసుకుని ఆమె వివరణ కోరడంతో సురేఖపై వేటు తప్పదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ఆమె వివరణ ఇవ్వడంతో ఇక చర్యలే తరువాయి అని కాంగ్రెస్ వర్గాలు కూడా అంటున్నాయి. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. అయితే కేబినెట్ నుంచి మాత్రం కొండా సురేఖకు ఉద్వాసన పలికే అవకాశాలున్నాయని అంటున్నారు. కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడం ద్వారా ఈ వివాదం ప్రభావం ప్రభుత్వంపై పడకుండా నివారించినట్లౌతుందనీ, ఆ తరువాత ఈ విషయంలో కొండా సురేఖ తన వ్యక్తిగత హోదాలో పోరాడాల్సి ఉంటుందని పరివీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/rahul-serious-on-konda-surekha-25-186294.html