రాహుల్ గాంధీ మరీ ఇంత పిరికి వాడా?
Publish Date:Jul 31, 2014
Advertisement
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకుడు నట్వర్ సింగ్ ఆత్మకథ పుస్తకం విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. ఈ పుస్తకంలో ఉన్నాయని చెబుతున్న అంశాలు ఎంతో ఆసక్తికరంగా వుండటమే కాకుండా కాంగ్రెస్ నాయకులకు కోపం తెప్పించేలా వున్నాయి. ఆల్రెడీ నట్వర్ సింగ్ పుస్తకంలోని విషయాల మీద కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను కూడా తన ఆత్మకథ రాసినప్పుడు అసలు నిజాలు బయటపెడతానని ఉక్రోషంగా ప్రకటించారు. నట్వర్ సింగ్ పుస్తకం విడుదలకు ముందే ఇంత సంచలనం సృష్టించింది. పుస్తకం విడుదలయ్యాక పరిస్థితి ఎలా వుంటుందో తలుచుకుంటేనే భలేగా వుంది. నట్వర్‌సింగ్ ఆత్మకథ పుస్తకంలో వెల్లడి అయిన విషయాలన్నిటీలో చాలా ఆసక్తికరంగా వున్న విషయం, సోనియాగాంధీ ప్రధానమంత్రి కాకుండా రాహుల్ గాంధీయే ఆపాడనే విషయం. సోనియాగాంధీ ప్రధానమంత్రి అయితే తన నానమ్మ ఇందిరమ్మలా, తండ్రి రాజీవ్ గాంధీలా తల్లి కూడా హత్యకు గురవుతుందని రాహుల్ భయపడ్డాడట. ఈ విషయంలో రాహుల్ మరీ పట్టుదలగా వ్యవహరించి తన తల్లి దేశానికి ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నాడట. నట్వర్ సింగ్ చెప్పినదాని ప్రకారం చూస్తుంటే రాహుల్ గాంధీ పరమ పిరికివాడన్న విషయం అర్థమవుతోందని పరిశీలకులు చెబుతున్నారు. మొన్నీమధ్య ముగిసిన ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ తన నాయనమ్మ చావు గురించి, తండ్రి చావు గురించి ప్రస్తావించి, తనను కూడా చంపేసే అవకాశం వుందని బేలగా మాట్లాడి ఓట్లు పొందాలని చూశాడు. అప్పుడే రాహుల్ గాంధీ పిరికితనం దేశానికి తెలిసిపోయింది. ఇప్పుడు నట్వర్ సింగ్ పుస్తకంతో ఆ విషయంలో మరింత క్లారిటీ వచ్చింది. అయినా సోనియాగాంధీ ప్రధానమంత్రి అయితే హత్యకు గురవుతుందని రాహుల్ గాంధీ బుర్రకి ఎందుకు అనిపించిందో ఏంటో! సోనియాగాంధీని ఎవరైనా చంపదలుచుకుంటే ప్రధానమంత్రి కాకపోయినా చంపుతారు. 2004 తర్వాత ఆము ప్రధానమంత్రి పదవిని చేపట్టకపోయినప్పటికీ, మన్మోహన్‌సింగ్‌ని అడ్డం పెట్టుకుని డిఫాక్టో ప్రధానమంత్రిగా పదేళ్ళపాటు రాజ్యం చేశారు కదా! సోనియాని చంపాలని ఎవరైనా అనుకునే పక్షంలో ఇలా పదేళ్ళు డిఫాక్టో ప్రధానిగా ఉన్నందుకయినా చంపుతారు. మరీ అంత చంపేస్తారని భయం ఉన్నప్పుడు రాహుల్ తన తల్లిని రాజకీయాల్లో ఉంచకుండా ఇంట్లోనే ఉంచేస్తే సరిపోయేదేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోనియా గాంధీ ప్రధానమంత్రి అయితే చంపేస్తారని రాహుల్ గాంధీ భయపడ్డాడు. మరి రాహుల్ గాంధీ తానే స్వయంగా ప్రధానమంత్రి అవ్వాలని కలలు కన్నాడే.. అప్పుడు తనను కూడా చంపేస్తారేమోనని భయం వేసి వుండాలి. అంత భయం వేసినా దేశం కోసం ఆయన ప్రాణాలకు తెగించి అయినా ప్రధానమంత్రి పదవిని చేపట్టాలని అనుకుని వుండాలి. ఇదంతా ఇలా వుంటే, రాహుల్ గాంధీ తన పిరికితనంతో దేశానికి ఎలాంటి సందేశం ఇచ్చాడు? ప్రధానమంత్రి పదవి చేపడితే ప్రాణభయం వుంటుందని చెప్పకనే చెబుతున్నాడు. ఇది సమర్థనీయమైన అంశం కాదు. రాహుల్ గాంధీ తాను పిరికిగా ఆలోచించడమే కాకుండా.. దేశానికి కూడా పిరికిమందు నూరిపోసే ప్రయత్నం చేశాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/rahul-gandhi-sonia-gandhi-prime-minister-natwar-singh-book-45-36714.html





