ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సరిపోదంటున్న రాహుల్.. అసలాయన టార్గెట్ ఎవరంటే?
Publish Date:Aug 6, 2026
Advertisement
నీట్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ఆందోళనల కారణంగా విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాక్రోచ్ ల ఉద్యమం విజయం సాధిండంతో.. కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచే దిశగా హస్తినలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాకుడు రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయకుండా కేవలం ఒక్క మంత్రి రాజీనామాతో సరిపెట్టడంఏమిటని నిలదీస్తున్నారు. దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జూలై 20న ఢిల్లీ వీధుల్లో వేలాది మంది విద్యార్థులు పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు బలప్రయోగం చేయడాన్ని లోక్ సభ వేదికగా రాహుల్ ఖండించారు. పార్లమెంట్‌లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు 2026పై జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ నేరుగా హోంమంత్రి అమిత్ షాను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అమిత్ షా ఆదేశాల మేరకే పోలీసులు విద్యార్థులపై దాడికి దిగారని ఆరోపించారు. భారత భవిష్యత్తు యువతపై పెల్లెట్లు ప్రయోగించడం దారుణమని, ఈ హింసాత్మక ఘటనలకు అమిత్ షా బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్ సభ వేదికగా రాహుల్ చేసిన ఈ డిమాండ్ దుమారం రేపింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ క్షమాపణ డిమాండ్ చేశారు. మరోవైపు జూలై 21న ప్రధానమంత్రి నివాసం ఎదుట ధర్నాకు దిగిన రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుని ఛత్రసాల్ స్టేడియం డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చెప్పులు లేకుండా మెట్లపై కూర్చుని రికార్డు చేసిన 2 నిమిషాల 15 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. విద్యార్థులకు, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యక్ష సందేశం పేరిట విడుదల చేసిన ఆ వీడియోలో.. విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడంలేదని ఆరోపించారు. నాణ్యమైన విద్య సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతోందని, తల్లిదండ్రులపై ఆర్థిక భారం విపరీతంగా పెరుగుతోందని, తరచూ ప్రశ్నపత్రాలు లీక్ కావడం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారమౌతోందని రాహుల్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం జూలై 25న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాతో సహా పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో రాహుల్ గాంధీ 10 జనపథ్ నివాసంలో సమావేశమయ్యారు. విద్యార్థులు కోరుతున్నది ఉచిత, నాణ్యమైన, పారదర్శకమైన విద్యావ్యవస్థ అనీ, కానీ ప్రభుత్వం విద్యాసంస్థలను నాశనం చేస్తోందని విమర్శించారు. విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సలర్ల నియమకాల నుంచి పరీక్షల నిర్వహణ వరకు వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయంటూ రాహుల్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరఫున పోరాటాన్ని లోక్ సభలోనూ, వీధుల్లోనూ కూడా మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. Rahul Gandhi demand , Amit Shah resignation, Dharmendra Pradhan Resignation, Student Protests Delhi, Paper Leak Controversy, Lok Sabha Debate 2026
http://www.teluguone.com/news/content/rahul-gandhi-demand--39-228153.html





