ప్రతిపక్ష నేతగా రాహుల్ వైఫల్యం.. సీజేపీ చీఫ్ వైపు చూస్తున్న జనం.!
Publish Date:Sep 26, 2026
Advertisement
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ రూపంలో సవాల్ ఎదురౌతోంది. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడంలో, నిలదీయడంలో విఫలమౌతున్నారన్న చర్చ గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో విస్తృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సీజేపీ చీఫ్ అభిజిత్ దిప్కే దూకుడు రాజకీయాలతో జాతీయ స్థాయిలో మోడీ సర్కార్ ను నిలదీస్తున్నారు. కేంద్రం మెడలు వంచి ధర్మేంద్ర ప్రదాన్ చేత రాజీనామా చేయించగలిగారు. దీంతో రాహుల్ గాంధీ చేయాల్సిన ప్రధాన పోరాటాలను సీజేపీ చీఫ్ తన చేతుల్లోకి తీసుకుంటూ, మంచి ఫలితాలు సాధించగలుగుతున్నారన్న అభిప్రాయం జనబాహుల్యంలో గట్టిగా వ్యక్తమౌతోంది. రాజీవ్ గాంధీ విఫలమైన చోట అభిజిత్ దిప్కే విజయాలు సాధిస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది, ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా క్రెడిట్ మొత్తం సీజేపీ చీఫ్ అభిజిత్ దిప్కే ఖాతాలో పడటాన్ని పరిశీలకులు ఉదాహరణగా చూపుతున్నారు. విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా ఆందోళనలకు నాయకత్వం వహించి ఆయన రాజీనామా చేయక తప్పని అనివార్యతను కల్పించడంలో సీజేపీ ఉద్యమం సక్సెస్ అయ్యింది. అలాగే తాజాగా ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ను లక్ష్యంగా చేసుకుంటూ సీజేపీ ఉద్యమానికి ఉపక్రమించింది. ఆయన రాజీనామాకు డెడ్ లైన్ విధించింది. వాస్తవంగా ఈ స్థాయి దూకుడు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలో కనిపించాలి. అయితే ఆ దూకుడు సీజేపీ చీఫ్ కనబరుస్తున్నారు. ఈవీఎంలు, అవినీతి, ఎన్నికల నిర్వహణలో లోపాలపై వచ్చే నెల 2 నుంచి దేశ వ్యాప్తం ఆందోళనకు సీజేపీ పీలుపునిచ్చిన సంగతి విదితమే. ఈ ఆందోళన ప్రకటిస్తూ.. సీజేపీ చీఫ్.. ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు. ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు. ప్రస్తుత జాతీయ రాజకీయ శూన్యతను భర్తీ చేసేలా సీజేపీ ముందుకు సాగుతోందన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో బలంగా వ్యక్తమౌతోంది. ఇక్కడే ప్రతిపక్ష నేతగా రాహుల్ వైఫల్యాలు మరింత ప్రస్ఫుటంగా తెరపైకి వస్తున్నాయి.
[Rahul Gandhi, CJP Chief, Abhijeet Dipke, Election Commissioner, Opposition Leader, Indian Politics, Challange, Cacroch Janata Party]
http://www.teluguone.com/news/content/rahul-gandhi-39-232570.html





