జాతి వివక్షత ఇంకానా.. మనం మనుషులమేనా
Publish Date:Jul 19, 2022
Advertisement
ఇంగ్లీషువారు అందరికీ అంటగట్టింది క్రికెట్ పిచ్చి. దీనికి కులమతాలు, భాషా, దేశ, ప్రాంతీయ విభేదాలేమీ లేవు. క్రికెట్ అంటే చెవి కోసుకునేవారు, చదువును పక్కన పెట్టే వీరాభిమానులు అనేకమంది. అసలు దేశాల మధ్య విభేదాలను, ద్వేషభావాన్ని తొలగించే శక్తి క్రికెట్‌కే వుందని ఆమధ్య ఎవరో ఒక రాజకీయవేత్తే అన్నారు. ఇది నిజం. గతంలో పాక్‌తో భారత్ తలపడిన ప్రపంచకప్ పోటీలో భారత్ గెలిచినపుడు కెప్టెన్ ధోనీని నీ హెయిర్ స్టయిల్ బావుందయ్యా అన్నారు పాక్ ప్రధాని! అంతా ఆశ్చర్యంతో, ఆనందంతో నవ్వుకున్నారు. అలాంటిది ఇంగ్లండ్ లో ఈమధ్య జాతివివక్ష కామెంట్లు వినిపించి ఆ జాఢ్యం ఇంకా పూర్తిగా పోలేదన్నది నిరూపించింది. ఆ మధ్య ఇంగ్లండ్ ఎడ్గ్‌బాస్టన్‌లో భారత్, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ జరిగింది. మనవాళ్లు ఎక్కడున్నా ఒకేలా గోల చేస్తారుగదా. అలా భారత్ జట్టు వీరాభిమానుల సంఘం సభ్యులు అక్కడ స్టేడియంలో జాతీయ పతాకం వూపుతూ గోల గోల చేశారు. కారణం భారత్ బ్రహ్మాండంగా ఆడుతున్న సమయమది. భారత్ అనేకాదు, ఎవరి జట్టుకు వారి వీరాభిమానులు అలానే గోల చేస్తుం టారు. ఇది చాలా సహజ దృశ్యం. కానీ తెల్లవారికి మాత్రం ఇలాంటివి బొత్తిగా నచ్చవు. ఇప్పటికీ వారి మనసులు మలినమే. ఇంకా వారిలో జాతివివక్షత ఉంది. ఇలాంటి సమయంలో అది బయటపడుతుంది. ఎడ్గ్‌బాస్టన్‌లో జరిగిన టెస్ట్ నాలుగో రోజు భారత అభిమానులమీద ఆంగ్లేయులు తిట్ల వర్షం కురిపించారు. స్టేడియంలోని హాలీస్ స్టాండ్ వేపు వున్న ఒక భారతీయ ప్రేక్షకుడిని జాతిపేర గట్టిగానే చాలా అసహ్యంగా దూషించాడు ఓ తెల్లవాడు. ఆ దూషణలు విన్న అతని కుటుంబం అక్కడి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. అయితే ఇది గమనించిన మరి కొందరు ఇంగ్లీషు ప్రేక్షకులు మాత్రం ఆ కుటుంబం జాగ్రత్తగా స్టేడియం బయటికి వెళ్లేందుకు సహాయపడ్డారు. కాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, వార్‌విక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అధికారులు ఈ సంఘటన గురించి వాకబు చేసి ఆ వ్యక్తులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది ఊహించనిదని దీన్ని మరీ పెద్దది చేయవద్దని అన్నారు. వారి దేశంలో జరిగింది గనుక వారికి ప్రతిష్టాభంగం కలగకుండా సంఘటనను తొక్కేశారు. ఇంతకంటే దారుణం మరొకటి వుండదు. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి సంఘటనలు జరగడం అనాగరికం. ప్రపంచ దేశాలు అభివృద్ధి పధంలో ముందడుగు వేస్తున్న కాలంలో ఇంగ్లండ్ లో ఇంకా ఇలాంటి ఆలోచనలు వుండడం మానవసమాజం హర్షించదు.
http://www.teluguone.com/news/content/racial-discriminationyet-39-140050.html





