మనుషులను పరుగులెత్తించే కుందేళ్లు.. ఆ దీవి ప్రత్యేకతే వేరు!
Publish Date:Jun 1, 2022
Advertisement
బెదురు చూపులు, పొడవు చెవులు.. అలికిడి వినిపిస్తే గంతులేస్తూ పరుగులూ.. ఇవీ కుందేళ్లంటే. అయితే ఆ దీవిలో కుందేళ్లకు మాత్రం బెదురు లేదు, భయం లేదు. మనిషి జాడ కనిపిస్తే చాలు వందలు, వేలుగా చుట్టుముట్టేస్తాయి. వాటి స్పీడుకు మనుషులే పరుగులు తీయాలి. అలికిడి వినిపిస్తే పారిపోవాల్సిన కుందేళ్లు ఆ అలికిడికే చుట్టుముట్టి మనుషులనే బెదించేయడంఏంటి. ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే కుందేళ్ల దీవి కథేంటో తెలుసుకోవలసిందే. జపాన్ లో ఉన్న ఒకోనిషిమా దీవినే కుందేళ్ల దీవి అని కూడా పిలుస్తారు. కేవలం చెత్త వేయడానికీ, విషవాయువుల మీద పరిశోధనలు చేయడాని మాత్రమే ఈ దీవిని ఉపయోగించేవారు. ఎవరో ఆ దీవిలో కొన్ని కుందేళ్లను వదలారట. అంతే వాటి సంతతి వందలూ వేలుగా పెరిగిపోయింది. కుందేళ్లను చూడటానికి జనం వస్తుండటంతో ఆ దీవి పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. అంతే అక్కడ చెత్తవేయడాన్ని జపాన్ ప్రభుత్వం నిషేధించింది. విషవాయువులపై ప్రయోగాలూ నిలిపివేసింది. ఆ దీవిలోకి పెంపుడు జంతువులను తీసుకు వెళ్లడాన్నీ నిషేధించింది. ఎవరైనా ఒంటరిగా ఆ దీవిలోకి వెడితే చాలు కుందేళ్ల దాడికి భయపడి పరుగులు తీయడమే. ఒకటి రెండు కాదు, వందా రెండోందలూ కాదు.. ఏకంగా వేల కుందేళ్లు ఒక్కసారిగా మీదకు వస్తుంటే ఎవరైనా బెదరడం సహజం. అలా అని కుందేళ్లేమీ ప్రమాదకరమైనవి కావు. ఆహారం కోసమే అలా దగ్గరకు వస్తాయి. ఆ దీవిని సందర్శించి వచ్చిన వాళ్లు ఫొటోలూ,వీడియోలూ సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడంతో కుందేళ్ల దీవి విశ్వవిఖ్యాతమైపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
http://www.teluguone.com/news/content/rabit-island-thousands-of-rabits-chase-people-25-136806.html





