బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో పురంధేశ్వరి
Publish Date:Mar 4, 2025
Advertisement
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి దక్కేదెవరికి అన్న ఉత్కంఠ కమలనాథుల్లోనే కాదు.. అందరిలోనూ వ్యక్తం అవుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా వారసుడెవరన్న ప్రశ్నకు సమాధానంగా ఇంత కాలం ఓ నాలుగైదు పేర్లు వినిపించినా.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈ నెల 15, 16 తేదీలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎవరన్నది పార్టీ హైకమాండ్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తతం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్ంలో ఆయన స్థానంలో మరొకరిని ఎన్నుకోవాలని అధిష్ఠానం నిర్ణయించింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉండటంతో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం రేసులో పదుల సంఖ్యలో నాయకులు ఉన్నప్పటికీ పార్టీ అధిష్ఠానం మాత్రం సమర్థుడైన నేతను ఎన్నుకోవాలన్న కృత నిశ్చయంతో ఉంది. మరో నాలుగేళ్ల పాటు కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వమే ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యత అంటే ఆషామాషీ వ్యవహారం కాదనీ, కూటమి పార్టీలతో సమన్వయంతో వ్యవహరించడమే కాకుండా, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేయాల్సి ఉంటుందనీ అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ పదుల సంఖ్యలో పదవి కోసం పోటీ పడుతున్న నేతలను ఫిల్టర్ చేసింది. ఆ తరువాత ప్రధానంగా రేసులో కేంద్ర మంత్రి, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజె, బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్, పార్టీ సీనియర్ నేత వినోద్ ధావ్డేలు ముందు వరుసలో నిలిచారని పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఈ నలుగురిలో ఎవరో ఒకరు బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని గట్టిగా వినిపించింది. అయితే అనూహ్యంగా, ఈ రేసులోకి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి దూసుకు వచ్చారు. ఆమెతో పాటు తమిళనాడుకు చెందిన వనతి శ్రీనివాసన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వనతి శ్రీనివాసన్ మహిళామోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె కోయంబత్తూర్ ఎమ్మెల్యే కూడా. దక్షిణాదిలో పార్టీ పటిష్టత, తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు ఇలా పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అగ్రనాయకత్వం వీరిద్దరిలో ఎవరో ఒకరికి పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తోందని తెలుస్తోంది. ఏది ఏమైనా నడ్డా వారసుడిని పార్టీలో ఏకాభిప్రాయ సాధన ద్వారానే ఎంపిక చేస్తారన్నది నిర్వివాదాంశం. ఇప్పటికే పార్టీ హైకమాండ్ దక్షిణాదికి చెందిన మహిళా నేతకు పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చేసిందనీ, దగ్గుబాటి పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్ లలో ఒకరిని ఎంపిక చేయడం ఖాయమనీ పార్టీ వర్గాలు అంటున్నాయి. దక్షిణాదికి చెందిన మహిళా నేతను పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ఎంపిక చేయడం ద్వారా పార్టీని అక్కడ బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందన్నది కమలనాథుల భావనగా కనిపిస్తోంది. 2014 నుంచి బీజేపీలో ఉన్న పురంధేశ్వరి.. సంస్థాగత నైపుణ్యాలలో దిట్ట. పురంధేశ్వరిని దక్షిణాది సుష్మా స్వరాజ్ గా చెబుతుంటారు. బీజేపీ క్యాడర్ లో ఉన్న పాపులారిటీ, ఐదు భాషల్లో ప్రావీణ్యం పురంధేశ్వరికి బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి అదనపు అర్హతలుగా చెప్పవచ్చు. ఇక విషయానికి వస్తే రాజకీయ అవసరాలు కూడా బీజేపీ అధ్యక్ష పదవి ఎంపికపై ప్రభావం చూపుతాయి. ఉత్తర ప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా చర్చించిన తరువాత మాత్రమే పార్టీ కొత్త అధ్యక్షుడెవరన్న నిర్ణయానికి కమలనాథులు వస్తారు. అయితే దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కోసం రేసులో పురంధేశ్వరి ముందు వరుసలో ఉంటారనడంలో సందేహం లేదు.
ఇక వనతి విషయానికి వస్తే.. ఆమె పార్టీ మహిళామోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలతో నేరుగా పరిచయం ఉన్న వ్యక్తి.
http://www.teluguone.com/news/content/purandheswari-in-race-for-bjp-national-president-39-193805.html





