గుడిలోనే పూజారి హత్య.. జగనన్న రాజ్యంలో మరో దారుణం!
Publish Date:Mar 22, 2022
Advertisement
ఏపీలో ఆలయాలకు, హిందువులకు రక్షణ లేదా? మత మార్పిడిలు, వరుస దాడులు దేనికి చిహ్నం? ఇవి చాలవన్నట్టు.. తాజాగా ఏపీలో గుళ్లోనే పూజారిని దారుణంగా నరికి చంపడం మరింత కలకలం రేపుతోంది. జగనన్న పాలనలో అరాచకాలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లలో దారుణం జరిగింది. గ్రామంలోని శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న కొత్తలంక శివనాగేశ్వరావును గుర్తుతెలియని వ్యక్తులు గుడిలోనే హత్య చేశారు. ఈ మర్డర్ రాత్రి జరిగినట్టుగా భావిస్తున్నారు. ఉదయం గుడి తెరిచాక కానీ.. పూజారి హత్య విషయం వెలుగు చూడలేదు. విషయం తెలిసి.. తాడిమళ్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోమవారం అర్ధరాత్రి అయినప్పటికీ భర్త ఇంటికి రాకపోవడంతో.. పూజారి భార్య ఆందోళన చెందింది. గుళ్లోనే ఉన్నారేమో అనుకొని.. రాత్రి ఆలయానికి వెళ్లారు కుటుంబ సభ్యులు. గుడి దగ్గర ఆయన వాహనం లేకపోవడంతో అక్కడే లేరేమోనని వెనక్కి వెళ్లిపోయారు. ఆ తర్వాత పొలం దగ్గరేమైనా ఉన్నారేమోనని.. పూజారి కోసం వెతికారు. తెల్లవారుజాము వరకూ గాలించినా ఆయన జాడ కనిపించకపోవడంతో.. ఏదైనా అర్జెంట్ పని మీద వేరే ఊరికేమైనా వెళ్లుంటారని భావించారు. చివరికి ఆలయ ప్రాంగణంలోనే పూజారి శివనాగేశ్వర్రావు రక్తపు మడుగులో చనిపోయి ఉండటం చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఈ విషయం తెలిసి గ్రామస్తులంతా ఉలిక్కిపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో ఆలయ రథం దగ్థం, విగ్రహాల విధ్వంసం లాంటి ఘటనలు కలకలం రేపుతుండగా.. ఇప్పుడిలా ఏకంగా గుళ్లోనే పూజారి హత్య కావించబడటం మరింత అనుమానాస్పదంగా మారింది. జగన్‌రెడ్డి పాలనలో ప్రజలకు, ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
http://www.teluguone.com/news/content/pujari-death-in-temple-39-133373.html





