అమరావతిపై మరోసారి జగన్ విషం.. ప్రజాగ్రహ సెగతో వైసీపీలో భయం!
Publish Date:Jan 10, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జగన్ అక్కసు తెలియంది కాదు. తాను అధికారంలో ఉండగా అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులంటూ సృష్టించిన గందరగోళ, అయోమయ పరిస్థితులే గత అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒక్కటన్నది నిర్వివాదాంశం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతిపై జగన్ కుట్రల ఫలితమే.. 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం. వైసీపీకి కనీసం ప్రతిక్ష హోదాకు కూడా అర్హత లేదని జనం ఆ ఎన్నికలలో తమ ఓటు ద్వారా విస్పష్ట తీర్పు ఇచ్చి 11 స్థానాలతో ఆ పార్టీని సరిపెట్టారు. కూటమి సర్దు బాట్ల కారణంగా కొన్ని స్థానాలలో వైసీపీ విజయం సాధించింది. లేకపోతే ఆ ఓటమి మరింత ఘోరంగా ఉండేదని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించిన సంగతి తెలిసిందే. అయితే అంతటి ఘోర పరాజయం తరువాత కూడా అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్. తాజాగా అమరావతి నదీగర్భంలో నిర్మిస్తూ చంద్రబాబు ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. అమరావతి నిర్మాణం ప్రజాధనం వ్యయంగా అభివర్ణించిన ఆయన రాష్ట్ర రాజధానిని విజయవాడ, గుంటూరు జాతీయ రహదారికి సమీపంలో నిర్మించాలన్నారు. అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. అమరావతిపై జగన్ ద్వేషం వెళ్లగక్కుతున్నారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నష్ట నివారణకా అన్నట్లుగా మాజీ మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగారు. జగన్ వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చడానికా అన్నట్లు హెరిటేజ్ కార్యాలయాన్ని నదీ గర్భంలో నిర్మించగలరా అన్న జగన్ ప్రశ్నకు ముందు నారా చంద్రబాబు, ఆయన కుటుంబం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి విషయంలో జగన్ మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ మాట్లాడారు. జగన్ అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 24 గంటలలో పేర్ని నాని రంగంలోకి దిగడం, జగన్ వ్యాఖ్యల తీవ్రతను డైల్యూట్ చేసేలా మాట్లాడటం చూస్తుంటే అమరావతి విషయంలో వైసీపీ తీరు పట్ల ప్రజా వ్యతిరేక సెగలు వైసీపీకి మరోసారి గట్టిగా తగిలాయనే భావించాల్సి వస్తోంది.
http://www.teluguone.com/news/content/public-backlash-on-jagan-for-opposing-amaravati-25-212336.html





