అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. ఎఫ్ఐఆర్ కు ముందే సొత్తు రికవరీ!
Publish Date:Jun 30, 2026
Advertisement
అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో.. ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి ముందే భారీగా సొత్తు రికవర్ కావడం సంచలనం సృష్టించింది. దేశవిదేశాల నుంచి భక్తులు అయోధ్య రామాలయానికి సమర్పించే కానుకలు, విరాళాల లెక్కింపు విభాగంలో జరిగిన ఒక భారీ చోరీ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి విదితమే. ఈ కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తు సాగుతుండగానే.. దాదాపు 58 లక్షల రూపాయల సొత్తు రికవర్ కావడం సంచలనం సృష్టించింది. సాధారణంగా ఏదైనా దొంగతనం లేదా అక్రమం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాతే రికవరీ ప్రక్రియ మొదలవుతుంది. కానీ అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కుంభకోణం కేసులో ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే, ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగడానికి ముందే.. ఆలయ ట్రస్ట్ అధికారులు తమ సొంత విచారణ ద్వారా నిందితుడి నుంచి ఏకంగా 58 లక్షల నగదును రికవర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయోధ్య రామమందిర విరాళాల నిధులలో భారీగా అక్రమాలు జరిగాయన్న విషయం.. తొలిసారిగా ఈ నెల 4న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంపై ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు వేగంగా స్పందించారు. అప్పటి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ జారీ చేసిన ఆదేశాల మేరకు ఆ మరుసటి రోజే అంటే జూన్ 5న కొంతమంది పోలీసు సిబ్బందిని వెంటబెట్టుకుని అధికారులు నేరుగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అవినాష్ శుక్లా నివాసానికి చేరుకున్నారు. అక్కడ జరిపిన ఆకస్మిక తనిఖీలలో చోరీకి గురైన స్వామివారి సొమ్ములో సుమారు 58 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అయితే చట్టపరమైన లూప్‌హోల్స్ బయటపడకుండా ఉండేందుకు నిందితులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. కేవలం రూ. 58 లక్షల నగదు రికవరీతోనే ఆగకుండా, జూన్ 5వ తేదీ నుంచి జూన్ 8వ తేదీల మధ్య గల కేవలం మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే, నిందితులు మిగిలిన బ్యాలెన్స్ మొత్తాన్ని బ్యాంక్ ఆన్లైన్ బదిలీల ద్వారా నేరుగా ట్రస్ట్ అధికారిక బ్యాంక్ ఖాతాకు తిరిగి పంపించేశారు. ఈ వ్యవహారమంతా అత్యంత గుట్టుచప్పుడు కాకుండా, తెరవెనుక సాగడం గమనార్హం. ఈ భారీ కుంభకోణం వార్తలు మీడియా ద్వారా బహిర్గతం కావడంతో, నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రాలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. తాజాగా ఈ రహస్య నగదు రికవరీకి సంబంధించిన సిసిటివి విజువల్స్ కూడా లీక్ అయ్యాయి. నిందితుడు నల్లటి భారీ బ్యాగ్‌తో పోలీసుల పర్యవేక్షణలో వెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రభుత్వం అధికారికంగా సిట్ వేయడానికి ముందే, ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండానే ఈ సమాంతర రికవరీ ప్రక్రియలు జరగడంపై ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి. అసలు చట్టపరమైన ఫిర్యాదు నమోదు చేయకుండానే ఈ స్థాయిలో రికవరీ ఎందుకు ప్రారంభించారు? ఇందులో తెరవెనుక ఏవైనా ఒప్పందాలు జరిగాయా? నిబంధనల ఉల్లంఘనలు ఏ స్థాయిలో జరిగాయి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎనిమిది మంది నిందితులు అరెస్టయ్యారు.
http://www.teluguone.com/news/content/property-recovered-even-before-the-fir-36-224569.html





