చంద్రబాబు, పవన్ నివాసాలకు ప్రధాని మోడీ
Publish Date:May 9, 2026
Advertisement
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (మే 10) తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా మిత్రపక్షాల నేతలైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో భేటీ కానున్నారు. ప్రధానిగా మూడో సారి బాధ్యతలు చేపట్టిన అనంతరం మోడీ హైదరాబాద్ పర్యటనకు రావడం ఇదే మొదటి సారి. ఈ పర్యటనలో భాగంగా ఆయన సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అది పక్కన పెడితే.. సాధారణంగా అధికారిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యే ప్రధాని నరేంద్ర మోడీ ఈ సారి ప్రోటోకాల్‌కు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లనున్నారు. ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. అక్కడ ఇరువురు నేతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ప్రధాని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ఎన్డీయే కూటమి ఐక్యతను చాటడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ తరువాత ప్రధాని మోడీ చంద్రబాబు నివాసం నుంచి నేరుగా మాదాపూర్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెడతారు. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న పవన్ కళ్యాణ్‌ను ఆయన పరామర్శిస్తారు. ప్రధాని ఒకే రోజు ఇద్దరు కీలక మిత్రపక్ష నేతల ఇళ్లకు ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి.
http://www.teluguone.com/news/content/prime-minister-modi-visits-chandrababu-and-pawan-residences-39-219350.html





