ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ బిల్లు 2025కు రాష్ట్రపతి ఆమోదం!
Publish Date:Apr 5, 2025
Advertisement
దేశంలోకి అక్రమ వలసలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకువచ్చి ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2005 పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొంది రాష్ట్రపతి వద్దకు చేరిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లుపై శుక్రవారం (ఏప్రిల్ 4) సంతకం చేశారు. దీంతో ఇక ఇది చట్ట రూపం దాల్చినట్లే. ఓ వైపు అమెరికాలో ఆ దేశాధ్యక్షుడు అక్రమ వలసదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వలసదారులను దేశం నుంచి వెళ్లగొడుతున్నారు. అలా వెళ్లగొట్టబడుతున్న వారిలో భారతీయ విద్యార్థలూ ఉన్నారు. ఇప్పుడు దేశంలో అక్రమ వలసల నిరోధానికి కేంద్రం తీసుకువచ్చిన ఈ ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం కూడా దాదాపు దేశంలోని అక్రమంగా వలస వచ్చిన వారిపై అటువంటి చర్యలకే ఉద్దేశించింనదిగా ఉంది. ఈ చట్టం ప్రకారం విదేశీయులను పర్యాటకులు, విద్యార్థులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, వ్యాపార సందర్శకులు, శరణార్థులు, అక్రమ వలసదారులుగా విభజిస్తారు. ఇప్పటి నుండి భారతదేశంలోకి ప్రవేశించే ఎవరైనా ముందుగా వీసా పొందాలి. సరైన పత్రాలతో రావాలి. ఎవరైనా దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తే వారికి రూ. 5 లక్షల వరకు జరిమానా, గరిష్టంగా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేందుకు ఈ చట్టం ఆస్కారం కల్పిస్తుంది. అలాగే నకిలీ వీసా లేదా పాస్‌పోర్ట్‌తో పట్టుబడిన ఎవరికైనా పది లక్షల రూపాయల జరిగామానా, 7 సంవత్సరాల వరకు జైలు శిక్షకు గురి కావాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ కొత్త చట్టం అక్రమవలసలను అరికట్టేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు. అలాగే దేశ భద్రతకు పూచీపడుతుందనీ, అదే సమయంలో దేశంలోని విదేశీయులు చట్టబద్ధంగా ప్రవేశించేందుకు మార్గాన్ని సుగుమం చేస్తుందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/president-approves-immigration-bill-39-195645.html





