ప్రశ్న రావణ్.. నిజంగా రావణుడే.!?
Publish Date:Jul 8, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రోజుకో దిమ్మదిరిగే వాస్తవం బయటకు వస్తోంది. రాజకీయ ప్రముఖులతో పాటు హిందూ దేవుళ్లను కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపాయి. ఈ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు సనాతన ధర్మంపై అత్యంత అసభ్యకర రీతిలో మాట్లాడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణల నేపథ్యంలో జోసెఫ్ రావణ్ చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఈ వ్యవహారంలో పోలీసులు తాజాగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను ప్రస్తావించారు. సమాజంలో మతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జోసెఫ్ రావణ్ ప్రసంగాలు సాగాయని పోలీసులు నివేదికలో వెల్లడించారు. అంతేకాకుండా.. రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై అవమానకరమైన రీతిలో పోస్టులు పెట్టడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థలపై ద్వేషం, వైషమ్యం పెంచేందుకు ప్రశ్న రావణ్ ప్రయత్నించినట్లు అధికారికంగా గుర్తించారు. పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులోని మరికొన్ని అంతర్గత విషయాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థులు, స్థానిక యువతను నిషేధిత మావోయిస్టు శ్రేణుల వైపు ఆకర్షితులయ్యేలా జోసెఫ్ రావణ్ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇటీవల ఏలూరు జిల్లాలో నిర్వహించిన ఒక దళిత క్రైస్తవ సదస్సులో ప్రశ్న రావణ్ రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్రసంగించడంతో పాటు, మావోయిస్టు అగ్రనేత హిడ్మాను కీర్తిస్తూ వ్యాఖ్యలు చేయడం పోలీసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ తీవ్రమైన నేరపూరిత మరియు సంఘవిద్రోహ చర్యల నేపథ్యంలో పోలీసులు జోసెఫ్ రావణ్‌పై సాధారణ చట్టాలతో పాటు దేశద్రోహ వ్యతిరేక చట్టాన్ని ప్రయోగించారు. ఆయనపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద కేసులు నమోదు చేయడంతో పాటు రాజద్రోహం సెక్షన్లను కూడా చేర్చారు. ఇప్పటికే ఈ యూట్యూబర్‌పై రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో దాదాపు తొమ్మిది కేసులు నమోదైనట్లు పోలీసులు ధృవీకరించారు. వరుసగా పలు జిల్లాల పోలీసులు ఆయనను ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో అదుపులోకి తీసుకుంటూ విచారిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ కేసులో వరుస అరెస్టుల పరంపర సాగుతోంది. పిఠాపురం, కాకినాడ సర్పవరం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, ఇనగుదురు వంటి పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా రావణ్‌ను పోలీసులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒక కోర్టులో బెయిల్ మంజూరైన వెంటనే, మరో జిల్లాకు చెందిన పోలీసులు సిద్ధంగా ఉండి ఆయన్ను అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వ విధానాలను, పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని దూషించారంటూ జనసేన, తెలుగుదేశం పార్టీల శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదులు అందజేస్తున్నారు. రాజకీయంగా, సామాజికంగా ఈ ఉదంతం రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. జోసెఫ్ రావణ్ భార్య, ఆయన తరఫు లీగల్ టీమ్ ఈ వరుస అరెస్టులపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఒకే తరహా అంశాలపై వరుస కేసులు పెడుతూ వేధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమపై నమోదైన అన్ని కేసులను ఒకే కేసుగా పరిగణించి విచారణ జరపాలని, దర్యాప్తునుసీబీఐకి అప్పగించాలని కోరుతూ జోసెఫ్ రావణ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం, డీజీపీని ప్రతివాదులుగా చేర్చారు. మరోవైపు, ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు కూడా ఫిర్యాదులు అందాయి. వరుస అరెస్టుల పేరిట పోలీసులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ మానవ హక్కుల ప్రతినిధులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ కేసును పరిశీలనలోకి తీసుకుంది. ప్రస్తుతం నిందితుడు గన్నవరం పోలీసుల పరిధిలో ఉపా చట్టం కింద విచారణ ఎదుర్కొంటుండటంతో, న్యాయస్థానాలు ఈ కేసును ఏ విధంగా పరిగణిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఉపా చట్టం కింద కేసు నమోదైనందున నిందితుడికి అంత సులభంగా బెయిల్ లభించే అవకాశం లేదని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.అదలా ఉంటే.. ప్రశ్న రావణ్ సెల్ ఫోన్ లోఅశ్లీల వీడియోలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల ఒకటి న ప్రశ్న రావణ్ అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో ఫోన్ డేటాను విశ్లేషించిన పోలీసులు అందులో కీలక సమాచారం ఉన్నట్లు తెలుసుకున్నారు. అయితే అప్పటికే రావణ్ తన ఫోన్లోని వీడియోలను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అలా డిలీట్ చేసిన డేటా కోసం పోలీసులు ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఆ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికలో షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. రావణ్ అమాయక యువతులను టార్గెట్ గా చేసుకుని వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం.. ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు ఫోరెన్సీక్ ల్యాబ్ నివేదికలో వెల్లడైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతో పోలీసులు ఈ కేసులో ఇప్పుడు రావణ్ బారిన పడిన బాధితులు ఎంతమంది ఉన్నారన్న కోణంలో అధికారులు చేపట్టి దాదాపు పదిమంది బాధితులను గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో మరింత కఠినమైన కేసులు జోసెఫ్ రావణ్ పై మోపే అవకాశం ఉంది. Joseph Ravan Case, Prasna Ravan Arrested, UAPA Act Andhra Pradesh, Joseph Ravan Maoist Links
http://www.teluguone.com/news/content/prasna-ravan-harrasment-and-blakmail-women-36-225425.html




