యాక్టింగ్ లో తోపు, రైటింగ్ లో టాప్.. పోసాని బాప్ రే బాప్!
Publish Date:Mar 3, 2025
Advertisement
పోసాని కృష్ణ మురళి.. తనదైన విలక్షణ నటనతో సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రచయతగా ఇండస్ట్రీలోకి వచ్చిన పోసాని.. రచయతగా కంటే నటుడిగానే ఎక్కువ సక్సెస్ అయ్యారు. సినీమాలలో డిమాండ్ ఉన్న సమయంలోనే ఆయన దృష్టి రాజకీయాల వైపు మళ్లింది. దీంతో కొంత కాలం రెండు పడవలపై కాళ్లుంచి పయనం సాగించిన పోసాని.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న తరువాత పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితమైపోయారు. మధ్యమధ్యలో అడపాదడపా సినిమాలలో కనిపించినా.. వైసీపీ రాజకీయాలలోనే ఆయన ఎక్కవ సమయం గడిపారు. సినీమాలలో నటించడం కంటే.. వైసీపీ తరఫున మీడియా సమావేశాలలో ప్రత్యర్థులపై విమర్శలు, తిట్టు కురిపిస్తే ఎక్కువ గిట్టుబాటు అవుతుందనుకున్నారో ఏమో ముఖానికి రంగు పూసుకోవలసిన అవసరం లేకుండా మైకుల ముందు నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆ క్రమంలో ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ ల పైనే కాకుండా వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో ఇష్టారీతిగా రెచ్చిపోయారు. అంతే కాకుండా సమాజంలో కుల విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం పోసానీ అవాకులు, చెవాకులకు అంతు లేకుండా పోయింది. ఎప్పుడైతే వైసీపీ ఎన్నికలలో పరాజయం పాలై గద్దె దిగిపోయిందో.. అప్పుడే పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి.. పరోక్షంగా తన వ్యాఖ్యలకు, చేష్టలకు క్షమాపణలు కోరారు. అయితే కర్మ వదలదుగా, ఆయన అనుచిత వర్తనపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒక కేసులో మూడు రోజుల కిందట పోసాని కృష్ణమురళి అరెస్టయ్యారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో రాజంపేట జైలుకు తరలించారు. ఆయన దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ సోమవారం (మార్చి 3) విచారణకు రానుంది. మామూలుగా అయితే బెయిలు వచ్చే అవకాశం లేదని భావించిన పోసాని.. ఆరోగ్య కారణాలు చూపుతూ బెయిలు సాధించేందుకు గుండెపోటు డ్రామాకు తెరతీశారు. ఆయన గుండె పోటు అంటూ జైలు అధికారులకు చెప్పడానికి కొద్ది సేపటి ముందు రాజంపేట సబ్ జైలులో ఆయనను రాజంపేట ఎమ్మెల్యే, వైసీపీ నేత అకెపాటి అమర్నాథ్ రెడ్డి ములాఖత్ ద్వారా కలిశారు. అలా అమర్నథ్ రెడ్డి పోసానితో భేటీ అయి వెళ్లారో లేదో ఇలా పోసాని గుండెల్లో నొప్పి అంటూ జైలు అధికారులకు చెప్పారు. అమర్నాథ్ రెడ్డి ములాఖత్ టైమ్ లోనే గుండెపోటు డ్రామాకు స్క్రిప్ట్ రెడీ అయ్యిందన్న అనుమానాలు ఉన్నాయి. స్వతహాగా రచయత అయిన పోసాని.. ఈ స్క్రిప్ట్ మాత్రం తనకోసం తానే రాసుకుని, ప్రాణం పెట్టి జీవించేశారని నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. వెంటనే జైలు సిబ్బంది ఆయనను హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం అంటూ కడప రిమ్స్ కు తరలిం చారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పోసానికి గుండె పోటే కాదు.. అసలెలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని నిర్ధారించారు. దీంతో ఆయనను మళ్లీ రాజంపేట సబ్ జైలుకు తరలించారు. దీంతో పోసాని సినిమాలలోనే కాదు.. జీవితంలోనూ బ్రహ్మాండంగా నటించగలరని లోకానికి వెల్లడైపోయింది. బెయిలు కోసం గుండెపోటు డ్రామా ఆడారని నెటిజనులు ఒక రేంజ్ లో పోసానిని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు పోసాని బెయిలు సంగతి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా మరో 16 పోలీసు స్టేషన్లలో ఆయనపై నమోదైన కేసులలో అదుపులోనికి తీసుకోవడానికి ఆయా పీఎస్ లు పీటీ వారెంట్లతో రాజంపేట సబ్ జైలుకు క్యూకడుతున్నాయి. తొలుత పీటీ వారెంట్ తో వచ్చిన నరసరావు పేట పోలీసులు ఆయనను అదుపోలోనికి తీసుకున్నారు. ఇహనో ఇప్పుడో నరసరావు పేట కోర్టులో పోసానిని హాజరు పరుస్తారు. గుండోపోటు నటనలో పోసాని జీవించేసినా.. ఫలితం లేకపోవడమే కాదు.. ఇప్పుడు పోసాని ఈ కేసు కాకపోతే మరో కేసు అంటూ వరుస అరెస్టులకు రంగం సిద్ధమైంది.
http://www.teluguone.com/news/content/posani-krishna-murali-super-acting-behind-bars-39-193763.html





