రాజ్యాంగ వ్యవస్థల మధ్య రాజకీయ యుద్ధం!
Publish Date:Mar 6, 2022
Advertisement
తెలంగాణలో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. హుజురాబాద్ పరాభవం నేపధ్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, కేంద్రంపై యుద్ధం ప్రకటించినప్పటి నుంచి రాజకీయ వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చివరకు, రాజ్యాంగ వ్యవస్థల మధ్య రాజకీయ వివాదాలు చోటు చేసుకునే స్థాయికి పరిస్థితి దిగజారింది. ఇప్పుడు మరో మెట్టెక్కి పతాక స్థాయికి చేరుకుంది. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య ఉండవలసి రాజ్యాంగ సంబంధాలపై రాజకీయ విబేధాలు ప్రభావం రోజురోజుకు మరింత పస్పుటం అవుతోంది. ఇప్పటికే గణతంత్ర వేడుకలపై ఆ ప్రభావం కనిపించింది. రాజ్ భవన్ వేదికగ జరిగిన అధికార వేడుకల్లో ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొనలేదు. అదే విధంగా మేడారం జాతర సందర్భంగాను, రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ నిబంధనలను పాటించలేదు. నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపైన, కేంద్రంలో అధికారంలో ఉన్న భారాతీయ జనతా పార్టీపైన రాజకీయ యుద్ధాన్ని మాత్రమే కాదు, రాజ్యాంగంపై కూడా యుద్ధాన్ని ప్రకటించారు. రాజ్యాంగం తిరగరాయాలనే ప్రతిపాదన చేశారు. సో.. సహజంగానే, ఆయన గవర్నర్’ ను గౌరవించడం తమకు అవమానం అనుకుని ఉండవచ్చును. అందుకే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ఆనవాయితీగా వస్తున్న గవర్నర్ ప్రసంగాన్నితొలిగించారు. గవర్నర్ పాత్ర, ప్రమేయం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే, కొత్త విధానానికి ముఖ్యమత్రి శ్రీకారం చుట్టారు. అయితే, ఇప్పుడు ఈ నిర్ణయం రాజకీయంగానే కాదు, రాజ్యంగపరంగానూ వివాదంగా మారింది. ఇంతవరకు, ప్రభుత్వ నిర్ణయాన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ విశ్లేషకులుమాత్రమే తాపు పట్టారు. కానీ, ఇప్పుడు గవర్నర్ తమిళిసై స్పందించారు.. బడ్జెట్ సెషన్స్‌లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల కొనసాగింపులో భాగంగానే.. బడ్జెట్ సమావేశాలు ఉంటాయన్న ప్రభుత్వ వైఖరి సరికాదని తప్పుబట్టారు. ప్రభుత్వం 5 నెలల తర్వాత సమావేశాలు నిర్వహిస్తూ.. కొనసాగింపు అనడం అనైతికమని దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు గమనించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేశామని ప్రకటించారు. సిఫార్సుకు సమయం తీసుకునే స్వేచ్ఛ తనకు ఉందని తెలిపారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల గతేడాది ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని కోల్పోతున్నారని తమిళిసై పేర్కొన్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంవుతున్న నేపధ్యంలో రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఏర్పడి ఈ రాజకీయ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనే ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాలో సాగుతోంది.
http://www.teluguone.com/news/content/political-war-between-constitutional-bodies-39-132656.html





