పొత్తులకు ఇంకా ముహూర్తం కుదరలేదా?
Publish Date:Mar 14, 2014
Advertisement
ప్రస్తుతం తెలంగాణాలో కాంగ్రెస్-తెరాసాలు పొత్తుల విషయం తేల్చుకోలేక ఆపసోపాలు పడుతున్నాయి. రెండు పార్టీలు కూడా తెలంగాణాలో ఉన్న 119 అసెంబ్లీ సీట్లలో తమకే 75 సీట్లు కావాలని పట్టుబడుతుండటంతో పొత్తులు కుదరడం లేదు. బహుశః ఒకటి రెండు రోజుల్లో ఆ సంగతీ తేలిపోవచ్చును. అదేవిధంగా తెరాస-మజ్లిస్-సీపీఐలు ఎన్నికల పొత్తులకు సిద్దపడుతున్నట్లు సమాచారం. కానీ, కాంగ్రెస్-తెరాసల మధ్య పొత్తుల కధ ముగిస్తే తప్ప, వాటి గురించి ఆలోచించలేదు. ఇక తెదేపా-బీజేపీలు కూడా పొత్తులపై నోరుమేదపలేని పరిస్థితిలో ఉన్నాయి. ఆంధ్రాలో బీజేపీకి ఉన్న వ్యతిరేఖత కారణంగా తెదేపా వెనుకాడుతుంటే, తెలంగాణాలో బీజేపీ నేతలే తెదేపాతో పొత్తులను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. అందువల్ల త్వరలో నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన తరువాతనే ఆ రెండు పార్టీల మధ్య పొత్తుల విషయం తేలవచ్చును. అంతవరకు వారు శత్రువులుగానే వ్యవహరిస్తారేమో. వైకాపా-సీపీయం పార్టీలు ఇంకా పొత్తులు కుదుర్చుకోకపోయినప్పటికీ ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా వామపక్ష పార్టీలు రెండూ మున్సిపల్ ఎన్నికల వరకు మాత్రం కలిసి పనిచేయాలని నిర్ణయించుకొన్నాయి. అయితే ఈరోజు సీపీఐ నారాయణ తెలంగాణా ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపే సాకుతూ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ను కలవడం చాలా ఆసక్తికరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేఖించే ఆయన స్వయంగా వెళ్లి అభినందనలు ఎందుకు చెపుతున్నారో త్వరలోనే బయటపడవచ్చును. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా కొత్త పార్టీ ప్రకటించబోతున్నందున, ఆయన పార్టీ విధి విధానాలు వగైరా చూసిన తరువాత ఏఏ రాజకీయ పార్టీలు ఎవరితో పొత్తుల పెట్టుకోవాలనే విషయంలో మరికొంత స్పష్టత రావచ్చును. పవన్ కళ్యాణ్ వామపక్ష భావజాలం పట్ల ఆసక్తి కలిగి ఉన్నందున లెఫ్ట్ పార్టీలతో పొత్తులకు అంగీకరిస్తే అంగీకరించవచ్చును. అదే జరిగితే, లెఫ్ట్ పార్టీలకు దశ తిరిగినట్లే. పవన్ కళ్యాణ్ కున్న అశేషజనాదారణ వల్ల అవి లాభాపడవచ్చును. అదేవిధంగా వాటికున్న బలమయిన క్యాడర్ వలన పవన్ కళ్యాణ్ పార్టీకి కూడా లబ్ది పొందవచ్చును. పవన్ విషయంలో సీపీఐ నారాయణ సానుకూలంగా స్పందించగా, సీపీయం రాఘవులు మాత్రం అది ప్రజా రాజ్యం పార్టీలా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుందని ముందే జోస్యం చెప్పడంతో, సీపీయం పవన్ పార్టీ పట్ల ఆసక్తి లేదని అర్ధమవుతోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏ పార్టీతోను పొత్తులకు ఆసక్తి చూపకపోయినట్లయితే, అన్ని పార్టీలు శత్రువులుగా మారడం తధ్యం. ఇప్పటికిప్పుడు ఆయనపై ఎవరూ దండయాత్ర చేయకపోయినా, మున్ముందు ఎన్నికల ప్రచారం మొదలయిన తరువాత, ఇతర పార్టీలు ఆయన వ్యక్తిగత విషయాలను సైతం కెలకకుండా వదిలిపెట్టవు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ‘జై సమైక్యాంధ్ర’ పార్టీని స్థాపించినప్పటికీ, ఆ పార్టీతో ఎన్నికల పొత్తుల గురించి ఏ పార్టీ ఆసక్తి చూపలేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమయినా ఆ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీతో కూడా పొత్తులు పెట్టుకొనే పరిస్థితిలో లేదు. మహా అయితే తమలాగే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకొన్న సీపీయంతో పొత్తులు ఆశించవచ్చును, కానీ ఆ పార్టీ ఇప్పటికే వైకాపా వైపు మొగ్గు చూపుతోంది గనుక ఆ అవకాశం కూడా లేదనే చెప్పాలి.
http://www.teluguone.com/news/content/political-parties-45-31238.html





