నటుడు నాగార్జునపై క్రిమినల్ కేసు వెనుక రాజకీయ ‘హస్తం’
Publish Date:Oct 5, 2024
Advertisement
హీరో నాగార్జునకు ఇటీవల ఒకదాని తరువాత ఒకటిగా ఇబ్బందులు, వివాదాలు ఎదురౌతున్నాయి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, కుమారుడు నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారంలో కొండా సురేఖ వ్యాఖ్యలు ఇలా నాగార్జునకు ఊపిరి సలపని వివాదాలు, కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఈ తరుణంలో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదై ఆయనకు కొత్త తల నొప్పి తీసుకువచ్చింది. దీని వెనుక ఏదైనా రాజకీయ కక్ష సాధింపు ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జనం కోసం అనే సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి మాదాపూర్ పోలీసు స్టేషన్ లో నాగార్జునపై ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువు కబ్జా చేసి అక్రమంగా ఎన్ కన్వెన్షన్ నిర్మించారనీ, ఆ విషయాన్ని రెవెన్యూ అధికారులు సైతం నిర్ధారించారనీ పేర్కొంటూ ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మాణం వల్ల ప్రజలకు అసౌకర్యం, పర్యావరణానికి భంగం కలిగించారనీ, ఎన్ కన్వెన్షన్ ద్వారా కోట్లాది రూపాయల వ్యాపారం చేశారని కసిరెడ్డి భాస్కరరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటన్నిటితో పాటు ఇరిగేషన్ చట్టాలను నాగార్జున ఉల్లంఘిచారని ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కసిరెడ్డి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. చెరువును పునరుద్ధరించడానికి అయ్యే ఖర్చును కూడా నాగార్జున నుంచే వసూలు చేయాలన్నారు. కసిరెడ్డి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదే కసిరెడ్డి తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టిఎల్‌లో నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించారంటూ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో కదిలిన హైడ్రా ఆ ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది. తాజాగా కసిరెడ్డి భాస్కరరెడ్డి మాదాపూర్ పోలీసు స్టేషన్ లో చేసిన ఫిర్యాదులో పర్యావరణానికి ఆటంకం కలిగించారని, ప్రజల్ని ఇబ్బందులకు గురిచేశారని, అందుకే ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన నెల రోజుల తర్వాత మళ్లీ కసిరెడ్డి భాస్కరరెడ్డి తెరపైకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల అక్కినేని నాగార్జున కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై సీరియస్ అయిన నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఈలోగా భాస్కరరెడ్డి మాధాపూర్‌లో నాగార్జునపై ఫిర్యాదు చేయడం వెనుక రాజకీయ హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
http://www.teluguone.com/news/content/political-hand-behind-criminal-case-againest-nagarjuna-39-186257.html