వైసీపీ కార్యాలయానికి మరోమారు నోటీసులు
Publish Date:Feb 10, 2025

Advertisement
తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి పోలీసులు మరోమారు నోటీసులు పంపారు. తాడేపల్లి ప్యాలెస్ బయట ఇటీవల స్వల్ప అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా ఆరోపణలు గుప్పించింది. జగన్ పై హత్యాయత్నం అంటూ వార్తలను వండి వార్చింది. ఈ అగ్నిప్రమాదం తాడేపల్లి ప్యాలెస్ బయట రోడ్డు పక్కన ఉన్న లాన్ లో జరిగింది. అయితే దీని వెనుక బారీ కుట్ర ఉందంటూ వైసీపీ ఆరోపణలు గుప్పించింది.
ప్రతిగా.. ఏపీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన ఆధారాలు మాయం చేయడానికి వైసీపీయే స్వయంగా ఈ అగ్నిప్రమాదాన్ని సృష్టించిందంటూ తెలుగుదేశం ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు తాడేపల్లి ప్యాలెస్ బయట జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. తాడేపల్లి ప్యాలెస్ లోని సీపీ ఫుటేజీ ఇవ్వాలంటూ తాడేపల్లి కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. అయితే పోలీసుల నోటీసుల మేరకు సీసీ ఫుటేజీ ఇవ్వడానికి వైసీపీ నిరాకరించింది. దీంతో పోలీసులు మరోమారు నోటీసులు పంపించారు. తాడేపల్లి ప్యాలెస్ బయట అగ్ని ప్రమాదం జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు, నాయకుల జాబితా ఇవ్వాలనీ, అలాగే సీసీ కెమెరా డేటా, పార్కింగ్ లోని వాహనాల వివరాలను మంగళవారం (ఫిబ్రవరి 11) తాడేపల్లి పీఎస్ లో సమర్పించాలని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులకు వైసీపీ కార్యాలయం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
గతంలో జగన్ పై కోడి కత్తి దాడి కేసులో కూడా పట్టుబట్టి ఎన్ఐఏ దర్యాప్తు కు ఆదేశాలు జారీ చేయించుకున్నప్పటికీ, ఆ కేసులో బాధితుడిగా జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వక పోవడంతో సంవత్సరాల తరబడి ఆ కేసు విచారణ సాగుతూనే ఉంది. అలాగే వైఎస్ వివేకా హత్య కేసులో కూడా సంఘటన జరగ్గానే ఇష్టారీతిగా ప్రత్యర్థులపై ఆరోపణలు గుప్పించిన వైసీపీ అధినేత ఆ తరువాత దర్యాప్తునకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. తనపై గులకరాయి దాడి కేసులో కూడా జగన్ అదే విధంగా వ్యవహరించారు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ బయట జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై కూడా ఇష్టారీతిగా ఆరోపణలు గుప్పించడమే తప్ప.. వివరాలను, ఆధారాలను సమర్పించడానికి మాత్రం ముందుకు రావడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
http://www.teluguone.com/news/content/police-serve-notice-to-ycp-office-39-192681.html












